
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జనిత్ లియనాగేను జట్టులో చేర్చుకుంది.
లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినందుకు (70, 19) లియనాగేకు లేటుగా ఆసియా కప్ బెర్త్ దక్కింది. లియనాగే చివరిగా 2022 ఫిబ్రవరిలో భారత్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు.
కెరీర్‌లో 29 వన్డేలు, 3 టీ20లు ఆడిన లియనాగే సెంచరీ, 6 అర్ద సెంచరీల సాయంతో 852 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో లియనాగే.. దసున్ షనక, చమిక కరుణరత్నేతో కలిసి లంక బ్యాటింగ్ లోతును పెంచనున్నాడు.
జట్టులో చేరిన హసరంగ
గాయంతో బాధపడుతున్నా, ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్న స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని లేటుగా జట్టులో చేరాడు. హసరంగ, లియనాగే దుబాయ్‌లో ఉన్న జట్టుతో కలిశారు.
ఆసియా కప్‌లో శ్రీలంక సెప్టెంబర్ 13న తొలి పోటీ (బంగ్లాదేశ్‌తో) ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న ఆ జట్టు.. సెప్టెంబర్ 15న హాంకాంగ్‌తో, సెప్టెంబర్ 18న ఆఫ్ఘానిస్తాన్తో పోటీపడుతుంది.
శ్రీలంక ఆసియా కప్ 2025 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుం నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరెరా, నువానిడూ ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశారా, దసున్ శానకా, జనిత్ లియనాగే, చామికా కరుణరత్నే, దునిత్ వెలలాగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార, మతీషా పథిరానా