#ShubmanGill: ప్లేఆఫ్‌లో సెంచరీ చేసిన ఏడో బ్యాటర్‌గా; ఒక్క శతకంతో ఇన్ని రికార్డులా

Shumban Gill 7th Batter Score-Century-IPL Play-Off-Broke Many Records - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్‌-2 పోరులో గిల్‌ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న గిల్‌కు ఇది సీజన్‌లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక్క సెంచరీతో గిల్‌ తన పేరిట చాలా రికార్డులు లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.


Photo: IPL Twitter

► ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌లో సెంచరీ బాదిన ఏడో క్రికెటర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ నిలిచాడు.  ఇంతకముందు ఐపీఎల్ 2014లో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు,  ఐపీఎల్ 2018లో షేన్ వాట్సన్ 117 పరుగులు,  ఐపీఎల్ 2014లో వృద్ధిమాన్ సాహా 115 పరుగులు, ఐపీఎల్ 2022లో మురళీ విజయ్ - 113, ఐపీఎల్ 2022లో రజత్ పాటిదార్ 112 పరుగులు, ఐపీఎల్‌ 2022లో జోస్ బట్లర్ 106 పరుగులు ప్లేఆఫ్‌లో సెంచరీలు చేశారు.

► ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు బాదిన యంగెస్ట్‌ క్రికెటర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) శుబ్‌మన్‌ గిల్‌ నిలిచాడు.


Photo: IPL Twitter

► ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా గిల్‌ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో 129 పరుగులు చేసిన గిల్‌.. సెహ్వాగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ తరపున 122 పరుగులు ఇప్పటివరకు టీమిండియా తరపున ఏ బ్యాటర్‌కైనా ప్లేఆప్‌లో అత్యధిక స్కోరు. తాజాగా గిల్‌ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

► ఐపీఎల్‌లో టీమిండియా తరపున అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్‌ నిలిచాడు. మ్యాచ్‌లో గిల్‌ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక 2020లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున 132 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ టీమిండియా తరపున ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.


Photo: IPL Twitter

► ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 800 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా గిల్‌ నిలిచాడు. ఇంతకముందు విరాట్‌ కోహ్లి 2016లో 973 పరుగులు చేశాడు. ఇక సెంచరీల విషయంలోనూ మరొక రికార్డు సాధించాడు. ఒక సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన గిల్‌.. ఐపీఎల్‌లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి(2016లో నాలుగు సెంచరీలతో) ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి(2016), బట్లర్‌(2022) నాలుగు సెంచరీలతో సంయుక్తంగా తొలి స్థానంలో ఉండగా.. గిల్‌ మూడు సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

► ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా గిల్‌.. సాహా, రజత్‌ పాటిదార్‌లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్‌ 49 బంతుల్లోనే శతకం అందుకోగా.. గతంలో సాహా ఐపీఎల్‌ 2014 ఫైనల్లో, రజత్‌ పాటిదార్‌(2022 ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో) 49 బంతుల్లోనే శతకం సాధించారు.


Photo: IPL Twitter

► ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో గిల్‌ తొలిస్థానంలో ఉన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్‌ 60 బంతుల్లో 129 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇంతకముందు వృద్దిమాన్‌ సాహా(2014 ఫైనల్‌). క్రిస్‌ గేల్‌(2016 ఫైనల్‌), వీరేంద్ర  సెహ్వాగ్‌(2014 క్వాలిఫయర్‌-2), షేన్‌ వాట్సన్‌(2018 ఫైనల్‌) తలా 8 సిక్సర్లు బాదారు.

చదవండి: గిల్‌ సెంచరీ.. ఒకే సీజన్‌లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్‌ క్రికెటర్‌గా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top