టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో తొలి విజయాన్ని విదేశాల్లో నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. భారత కెప్టెన్‌గా టీ20ల్లో తన తొలి విజయాన్ని (తాత్కాలిక కెప్టెన్‌గా) జింబాబ్వేలో నమోదు చేసిన గిల్.. టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని ఇంగ్లండ్‌లో, వన్డేల్లో తొలి విజయాన్ని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విజయం అనంతరం గిల్ ఖాతాలో ఈ అల్టిమేట్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్ గెలవడంతో భారత్ క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకుంది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆతిథ్య ఆసీస్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో భారత్‌ను గెలిపించాడు. అతనికి విరాట్ కోహ్లి సహకరించాడు.
కోహ్లి సరసన
ఇదే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తొలి వన్డేతో ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీ అరంగేట్రం చేసిన గిల్.. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్ ఓడిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సరసన చేరాడు.
గిల్ టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడాడు. టెస్ట్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నాడు. తాజాగా వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భంగపడ్డాడు.
మొత్తంగా గిల్‌కు భారత కెప్టెన్‌గా మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. తాత్కాలిక కెప్టెన్‌గా టీ20ల్లో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. జింబాబ్వేతో జరిగిన ఆ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.
టెస్ట్‌ల్లో భారత కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని, 5 మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించినప్పటికీ.. గెలుపుతో ముగించి వైట్‌వాష్ పరాభవం నుంచి తప్పించుకున్నాడు.
గిల్.. రేపటి నుంచి (అక్టోబర్ 29) సాధారణ ఆటగాడిగా ఆస్ట్రేలియాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.
చదవండి: మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!


