ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.
దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్‌లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.

రాజస్తాన్‌లోకి స్టబ్స్..
రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్‌కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్‌కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్‌తో పాటు ఓ అన్‌క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.
ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్‌క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్‌ఆర్‌కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్‌క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్‌డేవిల్స్) తరపునే చేశాడు.


