
రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యంతో సంజు సామ్సన్
జైపూర్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌కు, టీమ్ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామంతో స్పష్టమైంది. రాజస్తాన్ టీమ్‌లో సుదీర్ఘ కాలంగా భాగమైన సంజు సామ్సన్ జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్–2026 సీజన్‌కు ముందు తనను విడుదల చేయాలని అతను ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాది లీగ్ ముగియగానే సామ్సన్ తన మనసులో మాటకు మేనేజ్‌మెంట్‌కు వెల్లడించాడు. అయితే దీనిపై రాయల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
2025లో రూ.18 కోట్లతో సామ్సన్‌ను జట్టు అట్టి పెట్టుకుంది. అయితే గాయం కారణంగా సామ్సన్ 9 మ్యాచ్‌లే ఆడాడు. 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన రాయల్స్ 9వ స్థానంతో ముగించింది. తాను కోలుకున్నా రియాన్ పరాగ్‌కే కెపె్టన్సీ కొనసాగించడంతో పాటు సీజన్‌కు ముందు జోస్ బట్లర్‌ను టీమ్ వదిలేసుకోవడంపై కూడా యాజమాన్యంతో సామ్సన్‌కు విభేదాలు వచ్చాయి.
2013 నుంచి 2015 వరకు రాజస్తాన్ తరఫున ఆడిన సంజు ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడి 2018లో మళ్లీ రాయల్స్‌కే వచ్చాడు. 2021లో అతనికి కెప్టెన్సీ ఇవ్వగా తర్వాతి ఏడాదే జట్టు ఫైనల్‌కు కూడా చేరింది. మొత్తం జట్టు తరఫున 11 సీజన్లలో కలిపి అతను 149 మ్యాచ్‌లు ఆడి 4027 పరుగులు చేశాడు.