
సంజూ శాంసన్- రాహుల్ ద్రవిడ్ (PC: IPL/RR)
ఐపీఎల్-2026 (IPL 2026) టోర్నమెంట్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకొంటున్నట్లు తెలిపింది.
రాహుల్‌కు ధన్యవాదాలు
ఈ మేరకు.. ‘‘ఎన్నో ఏళ్లుగా రాయల్స్ ప్రయాణంలో రాహుల్ భాగంగా ఉన్నారు. ఆయన నాయకత్వం, అనుభవం యువ ఆటగాళ్లను ఎంతగానో ప్రభావితం చేశాయి. జట్టును విలువలతో కూడినదిగా.. పటిష్టంగా మార్చడంలో ఆయన ముద్ర ఉంది.
కోచ్‌గా ఈ ఫ్రాంఛైజీ మీద రాహుల్ బలమైన ముద్ర వేశారు. జట్టు నిర్మాణంలో భాగంగా రాహుల్‌కు మరో పదవిని ఫ్రాంఛైజీ ఆఫర్ చేసింది. కానీ ఆయన దానిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు.
రాజస్తాన్ రాయల్స్, మా జట్టు ఆటగాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది రాయల్స్ అభిమానుల తరఫున రాహుల్‌కు ధన్యవాదాలు. ఈ ఫ్రాంఛైజీ కోసం ఎనలేని సేవలు అందించిన రాహుల్‌కు కృతజ్ఞతలు’’ అంటూ రాజస్తాన్ రాయల్స్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కెప్టెన్‌గానూ...
ఐపీఎల్‌లో 2012, 2013 సీజన్లలో రాహుల్ ద్రవిడ్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా పనిచేశాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అదే ఫ్రాంఛైజీకి రెండేళ్లు మెంటార్‌నూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జట్టు కట్టిన ద్రవిడ్.. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా వెళ్లడంతో క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు.
ప్రధాన కోచ్‌గా
ఈ క్రమంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. 2024లో భారత్‌ను టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం హెడ్‌కోచ్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న ద్రవిడ్.. ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.
అయితే, ద్రవిడ్ మార్గదర్శనంలో రాయల్స్ ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
సంజూ- ద్రవిడ్ మధ్య విభేదాలు?
కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం.. అతడి స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ సారథిగా సక్సెస్ కాకపోవడం తీవ్ర ప్రభావం చూపాయి. అంతేకాదు.. సంజూ- ద్రవిడ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే సంజూ రాయల్స్‌ను వీడి వేరే ఫ్రాంఛైజీలో చేరనున్నాడనే వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడం గమనార్హం. తాము ఆఫర్ చేసిన పదవిని ద్రవిడ్ కాదన్నాడని.. అందుకే తప్పుకొన్నాడని రాయల్స్ స్వయంగా చెప్పడం విశేషం.
చదవండి: 'నా కెరీర్‌లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'