చెన్నై చెలరేగేనా! | Sanju Samson To Open, MS Dhoni Batting Position Locked in IPL 2026 | Sakshi
Sakshi News home page

చెన్నై చెలరేగేనా!

Mar 24 2026 5:32 AM | Updated on Mar 24 2026 5:32 AM

Sanju Samson To Open, MS Dhoni Batting Position Locked in IPL 2026

సూపర్‌కింగ్స్‌ ఆశలన్నీ సామ్సన్‌పైనే

ధోని దిశానిర్దేశం కీలకం

కెప్టెన్‌ రుతురాజ్‌పై తీవ్ర ఒత్తిడి  

ఏ సీజన్‌లోనైనా ఐపీఎల్‌ టైటిల్‌ ఫేవరెట్స్‌ ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఉండే జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. నిషేధం కారణంగా మధ్యలో రెండేళ్లు మినహాయిస్తే 16 సీజన్‌లలో 12 సార్లు టాప్‌–4లో నిలిచిన ఏకైక జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. 12 పర్యాయాల్లో ఐదుసార్లు విజేతగా... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి చెన్నై తమ సత్తా చాటుకుంది. అయితే గత రెండేళ్లలో చెన్నై జట్టు పరిస్థితి మారింది.

 ‘కెప్టెన్‌ కూల్‌’ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం... రుతురాజ్‌ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2023లో ధోని సారథ్యంలోనే ఐదోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన చెన్నై ఆ తర్వాత తడబడింది. రుతురాజ్‌ సారథ్యంలో 2024లో ఐదో స్థానంలో నిలిచిన ఆ జట్టు 2025లో అనూహ్యంగా చివరిదైన పదో స్థానంతో సరిపెట్టుకొని తమ లీగ్‌ చరిత్రలోనే పేలవమైన ప్రదర్శన నమోదు చేసింది.

సూపర్‌ కింగ్స్‌లో నాణ్యమైన ఆటగాళ్లే కాదు... పొట్టి ఫార్మాట్‌కు అవసరమైన స్పెషలిస్ట్‌ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఒకప్పటిలానే ఇప్పుడు కూడా ఈ జట్టు విదేశీ మెరుపుల కంటే భారత ఆటగాళ్లు, వారి బలాబలాలనే నమ్ముకుంది. అయితే దీనికి విదేశీ ఆటగాళ్లు మెరుపులు జోడిస్తే అది అదనపు బలమే అవుతుంది. ఫ్రాంచైజీల మధ్య జరిగిన అంతర్గత ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసి అతని స్థానంలో సంజూ సామ్సన్‌ను కొనుగోలు చేసింది. పలువురు దేశవాళీ కుర్రాళ్లను తీసుకోవడం ద్వారా జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యింది. 

కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్, శివమ్‌ దూబే చెన్నై కీలక ఆటగాళ్లు కాగా... క్రికెట్‌ దిగ్గజం ధోని తుది జట్టుకు ఆడుతున్నప్పటికీ అతని పాత్ర మాత్రం ఆటకంటే కూడా మార్గదర్శనంతోనే పరిమితమనే మాట జగమెరిగిన సత్యం. వయసు పైబడిన అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ ఆశాకిరణంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఫినిషర్‌గా బ్యాటింగ్‌కు దిగే అవకాశమైతే ఉంది! కానీ అన్ని మ్యాచ్‌ల్లో మాత్రం కాదు. మరోసారి ధోనికిది ఫేర్‌వెల్‌ ఐపీఎల్‌ కాగలదని క్రికెట్‌ విశ్లేషకులంతా భావిస్తున్నారు. దీంతో చెన్నై సహచరులంతా తమ అభిమాన భారత దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.  

బ్రెవిస్, హెన్రీలు సత్తా చాటితే 
చెన్నైకి భారత ఆటగాళ్లే కొండంత బలమైనప్పటికీ విదేశీ ఆటగాళ్లలో బ్రెవిస్, నూర్‌ అహ్మద్, హెన్రీలను కూడా నమ్ముకుంది. గత సీజన్‌లో సత్తా చాటుకున్న బ్రెవిస్, నూర్‌ అహ్మద్‌ రాణిస్తే చెన్నై మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటింగ్‌ వెన్ను విరిచే సత్తా ఉన్న మ్యాట్‌ హెన్రీ కూడా చెలరేగితే చెన్నై జోరుకు ఎదురుండదు. వేలంలో ఎవరి ఊహకి అందని విధంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌లను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లపై ఎవరికి ఎలాంటి అంచనాలున్నా... లేకున్నా... ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. లేకుంటే కేవలం ఇద్దరిపైనే రూ. 28.40 కోట్లనయితే ఖర్చు చేయదుగా! సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా సూపర్‌కింగ్స్‌ జట్టు ద్వారా అందరికంటా పడాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో  ఉన్నాడు.  

సామ్సన్‌ ‘కింగ్స్‌’ రాత మార్చేనా... 
సంజూ సామ్సన్‌ అంటే ఒకప్పుడు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టే గుర్తొస్తుంది. ఇప్పుడు అలా కాదు. 2026 టి20 ప్రపంచకప్‌ కూడా గుర్తుంటుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్‌ మొత్తం మ్యాచ్‌లు కూడా ఆడని ప్లేయర్‌... మొత్తం ప్రపంచకప్‌ కథనే మార్చిన ఆటగాడయ్యాడు. వెస్టిండీస్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌ను తలపించిన సూపర్‌–8 చివరి మ్యాచ్‌లో సామ్సన్‌ (97 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తర్వాత సెమీఫైనల్లో 89, ఫైనల్లో 89 స్కోర్లు భారత్‌ను ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేలా చేశాయి. అలా ఇప్పుడు ఐపీఎల్‌ ప్లేయర్‌ కాస్తా టీమిండియా స్టార్‌ అయ్యాడు. 

గెలిచిన కప్, ఆడబోయే లీగ్‌ రెండూ టి20 ఫార్మాటే కావడంతో ఈ ఫార్మాట్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సామ్సన్‌ ఇప్పుడు ధోని జట్టుకు బంగారు కొండలా కనిపిస్తున్నాడు. రుతురాజ్, శివమ్‌ దూబేలాంటి హిట్టర్లున్న కింగ్స్‌కు పూర్వవైభవం తేవాలన్నా... జట్టు రాత మారాలన్నా అది సామ్సన్‌ ఒక్కడి మెరుపులపైనే ఆధారపడి ఉంది. ధోని తుది జట్టుకు ఆడుతున్నాడనే ధైర్యం కూడా చెన్నైకి అదనపు బలం కాగాలదు. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే చెన్నై ఖాతాలో ఆరో టైటిల్‌ చేరడం సాధ్యమే. ఇదే జరిగితే ఫ్యాన్స్‌ ‘విజిల్‌ పొడు’తో సందడి చేసుకుంటారు. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెపె్టన్‌), ధోని, సంజూ సామ్సన్, ఆయుశ్‌ మాత్రే, బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, శివమ్‌ దూబే, ఉరి్వల్‌ పటేల్, అన్షుల్‌ కాంబోజ్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ చౌధరీ, నూర్‌ అహ్మద్, శ్రేయస్‌ గోపాల్, గుర్జప్‌నీత్‌ సింగ్, ఓవర్టన్, అకీల్‌ హోసీన్, ప్రశాంత్‌ వీర్, కార్తీక్‌ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్‌ ఖాన్, సర్ఫరాజ్, హెన్రీ, రాహుల్‌ చహర్, జాక్‌ ఫౌక్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement