వాన్‌పై మండిపడ్డ పాక్‌ మాజీ ఓపెనర్‌

Salman Butt Slams Michael Vaughan For Unnecessary Debates Over Kohli - Sakshi

ఇస్లామాబాద్‌: అనవసర కామెంట్లు చేస్తూ, అర్ధం పర్ధం లేని చర్చలను లేవనెత్తుతూ ఇటీవల కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న ఇం‍గ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌పై పాక్‌ మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సల్మాన్‌ బట్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కొద్ది రోజుల కిందట టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని న్యూజిలాండ్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌తో పోలుస్తూ వాన్‌ తెరలేపిన చర్చపై బట్‌ మండిపడ్డాడు. విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచపు అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచేవాడని వాన్‌ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నాడు.

వన్డే ఫార్మాట్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్‌ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు. 86 వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక్క శతకం కూడా నమోదు చేయలేని ఆటగాడు చర్చల్లో పాల్గొనేందుకు అనర్హుడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌, పాంటింగ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లిని ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన వాన్.. కోహ్లిలా గొప్ప క్రికెటర్‌ మాత్రం కాదని, అలాంటి వ్యక్తికి ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లికి మించిన ఆటగాడు లేడని, ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. రికార్డుల పరంగా చూసినా కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని, అలాంటప్పుడు అతన్ని సమకాలీకులతో పోల్చడం సమంజసం కాదని అభిప్రాయడ్డాడు.

కాగా, వన్డే ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా సాధించని వాన్‌.. టెస్టుల్లో మాత్రం 18 శతకాలు నమోదు చేశాడు. 1999 నుంచి 2007 మధ్యకాలంలో అతను 82 టెస్టుల్లో 5719 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో ఐదేళ్ల నిషేదానికి గురైన సల్మాన్‌ బట్‌.. పాక్‌ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: 'ఆ నెంబర్‌ వాన్‌ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top