ముంబై ఇండియన్స్‌పై జయభేరి
రాణించిన సాల్ట్, కోహ్లి, పాటీదార్
రూథర్‌ఫోర్డ్ మెరుపులు వృథా
ముంబై: టాప్–3 బ్యాటర్ల దూకుడుకు బౌలర్ల సహకారం తోడవడంతో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌లో మూడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్ దూకుడు ముందు నిలువలేకపోయిన బెంగళూరు... ముంబైపై సమష్టిగా సత్తా చాటింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 18 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (20 బంతుల్లో 53; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసి ఓడిపోయింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారీ ఛేదనలో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లయ దొరకబుచ్చు కోలేకపోయింది. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (31 బంతుల్లో 71 నాటౌట్; 1 ఫోర్, 9 సిక్స్‌లు) ధనాధన్ షాట్‌ల విరుచుకుపడినా అది ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది.
19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం కూడా ఫలితంపై ప్రభావం చూపింది. బెంగళూరు బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ముంబై స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని బెంగళూరు భారీ షాట్‌లతో విరుచుకుపడగా... బెంగళూరు స్పిన్నర్లు పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హార్దిక్ (బి) శార్దుల్ 78; కోహ్లి (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 50; రజత్ (సి) తిలక్ (బి) సాంట్నర్ 53; టిమ్ డేవిడ్ (నాటౌట్) 35; జితేశ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 10; షెఫర్డ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 240.
వికెట్ల పతనం: 1–120, 2–185, 3–194, 4–231.
బౌలింగ్: బౌల్ట్ 4–0–50–1; హార్దిక్ 4–0–39–1; బుమ్రా 4–0–35–0; సాంట్నర్ 4–0–43–1; మార్కండే 2–0–40–0; శార్దుల్ 2–0–32–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) భువనేశ్వర్ (బి) సుయాశ్ 37; రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 19; సూర్యకుమార్ (సి) రసిక్ (బి) కృనాల్ 33; తిలక్ వర్మ (సి) డఫీ (బి) సుయాశ్ 1; హార్దిక్ (సి) షెఫర్డ్ (బి) డఫీ 40; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 71; నమన్ ధీర్ (సి) రజత్ (బి) రసిక్ 1; సాంట్నర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 222.
వికెట్ల పతనం: 1–72, 2–74, 3–121, 4–145, 5–154.
బౌలింగ్: డఫీ 4–0–58–1; భువనేశ్వర్ 4–0–38–0; రసిక్ సలామ్ 2.5–0–23–1; కృనాల్ 4–0–26–1; సుయాశ్ 4–0–47–2; షెఫర్డ్ 1.1–0–28–0.


