చివరి టెస్ట్‌ రద్దు నిర్ణయంపై కస్సుబుస్సుమంటున్న మైఖేల్‌ వాన్‌

The Reason Behind Cancellation Of 5th Test Is IPL And Not Covid Says Michael Vaughan - Sakshi

లండన్‌: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మాంచెస్టర్‌ వేదికగా జరగాల్సిన చివరి టెస్ట్‌ కోవిడ్‌ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్‌ రద్దుకు మొగ్గుచూపిందంటూ ఇంగ్లీష్‌ మీడియా విషప్రచారం చేస్తోంది. దీనికి ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా తోడై టీమిండియా, బీసీసీఐలపై బురదజల్లుతున్నారు. కరోనా బూచిని చూపించి టీమిండియా డ్రామాలాడిందని, ఈ తతంగమంతా ఐపీఎల్‌ కోసమేనని రకరకాలు కథనాలు ప్రచారం చేస్తుంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్‌ వచ్చినా కోహ్లి సేన మ్యాచ్‌ ఆడేందుకు ససేమిరా అనడం, ఆపై మాంచెస్టర్‌ వీధుల్లో చక్కర్లు కొట్టడం, ఆ వెంటనే ఐపీఎల్‌ కోసం ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు బయల్దేరడంపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ కస్సుబుస్సులాడుతున్నాడు.

కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్‌ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్‌ మ్యాచ్‌ కంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్‌ టెస్ట్ 'నెగెటివ్‌' రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లి అండ్‌ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్‌ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ కాకుండా చివరకు 'డబ్బు' గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్‌ టెస్ట్‌ రద్దయిందని నోరుపారేసుకున్నాడు. 

మరోవైపు వాన్‌.. టీమిండియా ఆటగాళ్లపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సైతం ఘాటుగానే బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. ఆ సమయంలో టెస్ట్‌ సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్‌' లీగ్‌ కోసం రెండు, మూడో టెస్ట్‌ల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు ఆ సిరీస్ బాయ్‌కట్ చేసిందని నిలదీశాడు.
చదవండి: ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ బహిష్కరిస్తామని బెదిరింపులు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top