Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు.
ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్‌లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.
పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్‌లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్‌లో చాలా తప్పులున్నాయి. లైఫ్‌లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్‌ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.
ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్‌సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది.
Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026


