
ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన తొలి భారత క్రీడాకారుడిగా ఘనత
ఓపెన్ పురుషుల విభాగంలో కాంస్య పతకం సొంతం
చెన్నై: ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సర్ఫర్ రమేశ్ బుధియాల్ కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల ఓపెన్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత సర్ఫర్‌గా చరిత్ర సృష్టించిన రమేశ్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఓపెన్ పురుషుల కేటగిరీ ఫైనల్లో రమేశ్ 12.60 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
కొరియాకు చెందిన కనోవా హీజే 15.17 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకోగా... పజార్ అరియానా (14.57 పాయింట్లు; ఇండోనేసియా) రజతం దక్కించుకున్నాడు. మహిళల ఓపెన్ విభాగంలో జపాన్‌కు చెందిన అన్రి మసునో (14.90 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా... సుమోమో సటో (13.70 పాయింట్లు; జపాన్), ఇసాబెల్ హిగ్స్ (11.76 పాయింట్లు; థాయ్‌లాండ్) వరుసగా రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.
ఐదేళ్ల ప్రాయం నుంచే...
కేరళలోని కోవలంకు చెందిన 24 ఏళ్ల రమేశ్ బుధియాల్... ఐదేళ్ల ప్రాయం నుంచే అలలపై తేలియాడే క్రీడలో ఆరితేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించకపోగా... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ముందడుగు వేశాడు. ప్రాణాంతక క్రీడ కావడంతో కుటుంబ సభ్యులు ప్రోత్సాహించకపోగా... తన నైపుణ్యంపై విశ్వాసమున్న రమేశ్ ఎనిమిదో తరగతిలో చదువుకు స్వస్తి చెప్పి సర్ఫింగ్‌నే సర్వస్వంగా సాధన ప్రారంభించాడు.
అతడి కష్టానికి తాజాగా ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో ఫలితం దక్కింది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచిన అనంతరం రమేశ్ మాట్లాడుతూ... ‘నా కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఘనత. ఆసియా క్రీడలకు ముందు ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ టోర్నీ భారత్‌లో జరగడంతో మరింత మెరుగైన ప్రదర్శన చేయగలిగా. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నాడు. రమేశ్ తండ్రి మృతిచెందగా... తల్లి కోవలం తీరప్రాంతంలో ఓ చిన్న హస్తకళల దుకాణం నిర్వహిస్తోంది.