
ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్ ఓపెన్ మెన్స్ ఫైనల్‌కు అర్హత
తొలి భారత సర్ఫర్‌గా రికార్డు
చెన్నై: అలలపై తేలియాడే సర్ఫింగ్‌లో రమేశ్ బుధియాల్ చరిత్ర సృష్టించాడు. ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్ ఓపెన్ మెన్స్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత సర్ఫర్‌గా రమేశ్ రికార్డుల్లోకెక్కాడు. శనివారం సెమీఫైనల్లో రమేశ్ 11.43 పాయింట్లు సాధించి రెండో స్థానంతో తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇండోనేసియాకు చెందిన పజర్ అరియానా 13.83 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో రమేశ్ 14.84 పాయింట్లతో ఫిలిప్పిన్స్ సర్ఫర్ నీల్ సాంచెస్ (12.80 పాయింట్లు) వెనక్కి నెట్టి ముందంజ వేశాడు. భారత్‌కు చెందిన కిషోర్ కుమార్ కూడా సెమీఫైనల్‌కు చేరగా... అతడు 8.03 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
మరో భారత సర్ఫర్ శ్రీకాంత్ క్వార్టర్స్‌లో పోరాడి ఓడాడు. అండర్–18 ఈవెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఈ విభాగంలో హరీశ్, ఆద్య సింగ్, దమయంతి శ్రీరామ్ క్వార్టర్స్‌లో పరాజయం పాలై ఇంటిబాట పట్టారు.