మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్‌  | Rajat Patidar has cemented an era of absolute dominance as the captain | Sakshi
Sakshi News home page

మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్‌ 

Jun 2 2026 5:54 AM | Updated on Jun 2 2026 5:54 AM

Rajat Patidar has cemented an era of absolute dominance as the captain

గత ఏడాదితో పోలిస్తే ఈసారి తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగామని, అందుకే స్వేచ్ఛగా ఆడి ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించామని ఆర్‌సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ వ్యాఖ్యానించాడు. విజయానంతరం తన ఆనందాన్ని అతను మీడియాతో పంచుకున్నాడు. ‘టోర్నీలో ఏ దశలోనూ ఒత్తిడిని ఎదుర్కోలేదు. ప్రతీ మ్యాచ్‌లో ప్రశాంతంగా ఆడాం. ఈసారి ఇతర జట్లను ఓడించడం మాత్రమే కాదు, సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించాం. ఇలాగే ఆడితే రెండో టైటిల్‌ సాధించగలమనే నమ్మకం ఆరంభంలోనే కలిగింది.

ఇంతకంటే మంచి పుట్టిన రోజు కానుక ఏదీ ఉండదు. ఇకపై వరుసగా మూడో టైటిల్‌ ఎలా గెలవాలనే దానిపైనే మా దృష్టి’ అని అతను అన్నాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా పాటీదార్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులతో ఈ దూకుడు సాధ్యమైందని అతను వెల్లడించాడు. ‘నా కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడకపోయినా మ్యాచ్‌లో పరిస్థితులపై పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాను. టీమ్‌ మేనేజ్‌మెంట్, ఆటగాళ్ల మద్దతు కూడా నాకు ఉండటంతో అంతా సానుకూలంగా మారిపోయింది. 

ఐపీఎల్‌కు ముందు బ్యాటింగ్‌ విషయంలో తీవ్రంగా సాధన చేశాను. మెంటార్‌ దినేశ్‌ కార్తీక్‌తో చర్చించి కొన్ని సాంకేతిక అంశాలను మార్చుకున్నాను. మ్యాచ్‌లో నా పాత్రపై నాకు చాలా స్పష్టత ఉండటం వల్లే ఈ స్కోర్లు సాధించగలిగాను’ అని పాటీదార్‌ చెప్పాడు. 2025లో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల సమయంలో మరణించిన 11 మంది ఆర్‌సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు అతను ప్రకటించాడు. నాటి ఘటన నేపథ్యంలోనే ఈ సారి బెంగళూరు నగరంలో ఎలాంటి విక్టరీ పరేడ్‌ నిర్వహించరాదని, బహిరంగంగా ఏ తరహా సంబరాలు చేయరాదని ఆర్‌సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఆదివారం రాత్రి ఫైనల్‌ ముగిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ బెంగళూరు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో, బ్యారికేడ్ల నియంత్రణలోనే జరగడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement