ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రఫుల్ హింజ్ (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) అనే ఇద్దరు అరంగేట్రం పేసర్లు రాయల్స్ జైత్రయాత్రను బ్రేక్ చేసి సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్నందించారు. ఈ క్రమంలో హింజ్ ఓ చారిత్రక రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
హింజ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అతనికి సకిబ్ కూడా జత కావడంతో రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చారిత్రక పతనం దిశగా సాగింది. అయితే రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) అనూహ్యంగా ప్రతిఘటించి ఆ పతనాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఓ చారిత్రక రికార్డు నెలకొల్పింది.
ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా జట్టు స్కోర్ 150 పరుగుల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో జడేజా, ఫెరియెరా ప్రతిఘటించడంతో రాయల్స్ 159 పరుగులకు ఆలౌటై, 57 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ లెక్కన రాయల్స్ ఓటమిలోనూ చరిత్ర సృష్టించింది.
ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇదే తొలి ఓటమి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టుకు సన్‌రైజర్స్ తమ సొంతగడ్డపై బ్రేకులు వేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్ (91) శివాలెత్తడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో హింజ్, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాజస్థాన్ రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. హింజ్, సకిబ్‌కు ఎషాన్ మలింగ (4-0-31-2) కూడా సహకరించాడు. రాయల్స్ తరఫున ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది.


