ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు.
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యవంశీ సీఎస్‌కేతో మ్యాచ్ ముగిసిన అనంతరం దూకుడైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..‘ నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేక్ కటింగ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోయాను.
ఇక సీఎస్‌కేతో మ్యాచ్ విషయానికొస్తే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. అయితే మొదట్లో బ్యాటింగ్ కాస్త కష్టమనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ నా పని సులువయింది. డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ సీఎస్‌కే విధించిన లక్ష్యం చిన్నది కావడంతో పవర్ ప్లేలో వీలైనంత స్కోర్ చేయాలని భావించాం.
ఒకవేళ స్కోర్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ నేను ఎక్కడా ఆ అవకాశం తీసుకోలేదు. మా కోచ్‌లు కూడా ప్రతి బౌలర్‌పైనా అటాకింగ్ గేమ్ ఆడమని చెప్పారు. నేను వాళ్ల మాటలను తూచా తప్పకుండా పాటించాను.
ఇక ప్రతీ బంతి తర్వాత జైస్వాల్‌తో మాట్లాడుతూనే వచ్చాను. అతను ఎక్కువగా సింగిల్స్ తీసి నాకు స్ట్రైకింగ్ ఇచ్చి ప్రోత్సహించడంతో స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడగలిగాను’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.


