'ప్రపంచ అద్భుతాల గురించి అడిగితే.. సింధు ఆటని చెబుతా'

PV Sindhu Preparation For Tokyo Olympics - Sakshi

ప్రపంచంలో మీరు చూసిన అద్భుతాల గురించి చెప్పమంటూ ఎవరైనా అడిగితే... నేను సింధు ఆటను చూశానని చెబుతాను! ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించిన తర్వాత ఒక భారత బ్యాడ్మింటన్‌ అభిమాని ఇలా తన ఆనందాన్ని పంచుకున్నాడు. సింధు ఎంత బాగా ఆడిందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి వ్యాఖ్య చాలు. ఎలాంటి అంచనాలు లేకుండా రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి రజతం గెలుచుకున్న నాటినుంచి అందరి ఆశలను మోస్తూ ‘టోక్యో’లో కాంస్యం సాధించే వరకు మన తెలుగు తేజం సింధు సాగించిన ప్రయాణం ఎంతో ప్రత్యేకం. ఐదేళ్ల విరామంతో రెండోసారి ఒలింపిక్‌ పతకం సాధించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. దారిలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఆట గతి తప్పేందుకు మరెన్నో అవకాశాలున్నా సింధు వాటిని అలవోకగా అధిగమించింది. ఆట మాత్రమే కాదు మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండటం వల్లే కాంస్య పతక పోరులో ఆమె తన జోరు చూపించగలిగింది. స్వర్ణం సాధించే అవకాశం చేజారిపోయిన 24 గంటల్లోపు మూడో స్థానం కోసం బరిలోకి దిగడం అంటే ఎంత భారంగా ఉంటుందో ఒకరోజు ముందు ఆడిన టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను తెలుస్తుంది! 

ఆటకు పదును పెట్టి... 
కొన్నాళ్ల క్రితం వరకు సింధు అంటే అటాక్, అటాక్, అటాక్‌... తన ఎత్తును సమర్థంగా వాడుకుంటూ అద్భుతమైన స్మాష్‌లతో హడలెత్తిస్తూ ప్రత్యర్థిపై చెలరేగిపోవడం సింధు అతి పెద్ద బలం. సింధు ఎగిరి కొడితే పాయింట్‌ ఖాయంగా వచ్చేది. అయితే ఆధునిక బ్యాడ్మింటన్‌లో ఒకటే అస్త్రంతో యుద్ధం చేయడం అంత సులువు కాదని సింధుకు కొన్ని పరాజయాల తర్వాత అర్థమైంది. మెల్లగా తన బలహీనతలను సరిదిద్దుకునే ప్రయత్నంలో అన్నింటికంటే ముందు ‘డిఫెన్స్‌’ కనిపించింది. రిటర్న్‌లు చేయడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని ఆమె గుర్తించింది. అంతే... దానిని సరిదిద్దుకునేందుకు తీవ్రంగా కష్టపడింది. సుదీర్ఘ సమయం పాటు దానిని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆమె డిఫెన్స్‌లో కూడా ఎంత పదునుందో అందరికీ కనిపించింది. ఇక ఫిట్‌నెస్‌ గురించి సింధు పడిన ప్రత్యేక శ్రమ అడుగడుగునా కనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడినప్పుడు బాగా అలసిపోకుండా ఆ వెంటనే కోలుకొని మళ్లీ ప్రత్యర్థిపై దాడి చేయగలిగే ఫిట్‌నెస్‌ లక్ష్యంగా సింధు పని చేసింది. ట్రెయినర్‌ శ్రీకాంత్‌ వర్మతో పాటు సింధుతో టోక్యో వెళ్లిన ఫిజియో బద్దం ఎవాంజెలిన్‌ ఆమెకు ఇందులో ఎంతో సహకరించారు.  

పార్క్‌ టే సంగ్‌ పర్యవేక్షణలో... 
సింధు విజయంలో జట్టు కోచ్, కొరియాకు చెందిన పార్క్‌ టే సంగ్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. రియో ఒలింపిక్స్‌ సమయంలో భారత చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పూర్తి స్థాయిలో ఆమెకు శిక్షణలో సహకరించగా, ఇప్పుడు గోపీచంద్‌ పర్యవేక్షణలో పార్క్‌ సింధుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి ఆపై కొరియా జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించిన పార్క్‌కు సింగిల్స్‌ కోచ్‌గా మంచి గుర్తింపు ఉంది. కరోనా సమయంలో కూడా పార్క్‌ ఇక్కడే ఉండిపోయి గంటలకొద్దీ ప్రాక్టీస్‌కు అవకాశం కల్పించాడు. 2016తో పోలిస్తే 2020 ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ప్రపంచమే మారిపోయింది. సుదీర్ఘ సమయం పాటు టోర్నీలే లేవు. రియో ఒలింపిక్స్‌కు ముందు ఆ ఏడాది సింధు 13 టోర్నీలు ఆడితే, టోక్యోకు ముందు కేవలం 5 టోర్నీలే ఆడగలిగింది. ఇలాంటి స్థితిలో ఆటగాళ్లకు తగిన ప్రేరణ కూడా లభించదు. కానీ సింధు మాత్రం ఈ సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. కోచింగ్‌లో ఎక్కడా ఉదాసీనతకు తావీయకుండా, దాదాపు విరామం అనేదే లేకుండా సాధన చేస్తూ ప్రతీ రోజూ తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టింది. అదే టోక్యోలో ఆమెకు పతకాన్ని తెచ్చి పెట్టింది. టోక్యో స్టేడియంలోని పరిస్థితులను అలవాటు పడేందుకు తన ప్రాక్టీస్‌ను గోపీచంద్‌ అకాడమీ నుంచి గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియానికి మార్చుకోవడం కూడా వ్యూహంలో భాగమే. దీనికి సంబంధించి గోపీచంద్‌తో విభేదాలంటూ వార్తలు వచ్చినా సింధు పట్టించుకోలేదు. తన లక్ష్యంపైనే దృష్టి పెట్టింది.  

ఒకటే లక్ష్యంగా... 
రియో ఒలింపిక్స్‌ గెలుపు తర్వాత పెద్ద ఎత్తున కీర్తి కనకాదులు సింధు వద్దకు వచ్చి చేరాయి. భారీ నజరానాలు, నగదు పురస్కారాలు, అవార్డులు, ఎండార్స్‌మెంట్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం... ఇలా సింధు ముందు వాలాయి. మరో ప్లేయర్‌ అయితే ఇంత సాధించాక ఇంక ఏముందంటూ ప్రశాంతంగా ఆగిపోయేవారేమో! కానీ సింధు అలా చేయలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటూ కొత్తగా అప్పుడే ఆటలోకి వచ్చిన షట్లర్‌ తరహాలో కష్టపడింది. ఎన్ని ఆకర్షణలు వచ్చి చేరినా ఆమెలో ఏకాగ్రత చెదరలేదు. ‘రియో’ పతకం తర్వాత కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రెండు రజతాలు, బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌ విజయాలు సాధించగలిగిందంటే ఆమెలో ఎంత కసి ఉందో అర్థమవుతుంది. అదే కసిని కొనసాగించి ఇప్పుడు భారత క్రీడా చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకరిగా సింధు నిలిచిపోయింది. స్వర్ణం సాధించలేకపోవచ్చు గానీ... నిలకడ కొనసాగిస్తూ ఆడిన తొలి రెండు ఒలింపిక్స్‌లలో రెండు పతకాలు సాధించడం అంటే ఒకే ఒక స్వర్ణం సాధించిన అభినవ్‌ బింద్రా ఘనతకంటే ఎక్కువే అంటే అతిశయోక్తి కాదేమో!    

అద్భుత ఆటతో వరుసగా రెండో ఒలింపిక్‌ పతకం సాధించిన సింధుకు అభినందనలు. సింధుతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది శ్రమ వల్లే ఇది సాధ్యమైంది. స్టేడియంలో ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం, ‘బాయ్‌’కు నా కృతజ్ఞతలు. వరుసగా 3 ఒలింపిక్స్‌లలో బ్యాడ్మింటన్‌కు పతకాలు రావడం గర్వంగా ఉంది.  –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ 

బలహీనంగా ఉన్న డిఫెన్స్‌ను మెరుగుపర్చేందుకు మేం ఇద్దరం కలిసి సుదీర్ఘ సమయం పని చేశాం. సెమీస్‌ ఓటమి తర్వాత ఏడుస్తూ ఉన్న ఆమెను ఓదార్చి ఈ మ్యాచ్‌ కోసం సిద్ధం చేయాల్సి వచ్చింది. సింధుకే కాకుండా నా కోచింగ్‌ కెరీర్‌లో కూడా ఇదో గొప్ప క్షణం. ఆటగాడిగా, కోచ్‌గా ఎప్పుడూ ఒలింపిక్‌ పతకం గెలవలేకపోయిన నాకు ఇదే తొలి మెడల్‌. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.  –పార్క్‌ టే సంగ్, సింధు కోచ్‌ 

ఒలింపిక్స్‌లో సింధు రెండో పతకం సాధించడం చాలా సంతోషం కలిగించింది. తీవ్ర ఒత్తిడి ఉన్నా దానిని ఆమె అధిగమించగలిగింది. ఒలింపిక్స్‌లో ఏ పతకమైనా గొప్పదే. ఈ మెడల్‌ ఆమె నాకు అందించిన బహుమతి.    –పీవీ రమణ, సింధు తండ్రి    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top