
తొలి రౌండ్‌లోనే ఓడిన భారత స్టార్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
టోక్యో: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 30 ఏళ్ల సింధు 15–21, 14–21తో ఓడిపోయింది. గతంలో సిమ్ యు జిన్‌తో ఆడిన మూడుసార్లూ గెలిచిన సింధు నాలుగో ప్రయత్నంలో తొలిసారి ఓటమి చవిచూసింది.
38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ఒకదశలో 3–9తో వెనుకబడింది. ఆ తర్వాత తేరుకొని ఆధిక్యాన్ని 12–13కు తగ్గించింది. అయితే కీలకదశలో కొరియా ప్లేయర్ పైచేయి సాధించి సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్‌లో మూడుసార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 11–11వద్ద ఉన్నపుడు సిమ్ యు జిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సింధుపై ఆమె తొలిసారి విజయాన్ని అందుకుంది.
ఈ ఏడాది సింధు ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్ టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. తదుపరి సింధు వచ్చే మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు భారత్‌కే చెందిన ఉన్నతి హుడా 8–21, 12–21తో చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోగా... అనుపమ 21–15, 18–21, 21–18తో సహచరిణి రక్షిత శ్రీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–10తో కాంగ్ మిన్ హైయుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా) జోడీని ఓడించింది. రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) ద్వయం 15–21, 9–21తో కిమ్ వన్ హో–సియో సెయుంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ (భారత్) 21–11, 21–18తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.