సింధు... అక్కడే ఆగిపోయింది!

PV Sindhu Fails to break semis In All England Championship - Sakshi

మళ్లీ సెమీస్‌లోనే ఇంటిముఖం

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌  

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ చాంపియన్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఓ సువర్ణావకాశాన్ని వదిలేసింది. చైనా, చైనీస్‌ తైపీ, దక్షిణ కొరియా స్టార్‌ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) కూడా గైర్హాజరయిన నేపథ్యంలో... ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ గెలిచేందుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులను సింధు సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనవసరంగా ఒత్తిడిలోకి వెళ్లి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్ట్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ నుంచి సింధు సెమీఫైనల్లో నిష్క్రమించింది.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 17–21, 9–21తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో భారత స్టార్‌ నిరాశపరిచింది. రెండో గేమ్‌లోనైతే సింధు కనీస ప్రతిఘటన కూడా చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. తొమ్మిదోసారి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఆడిన సింధు సెమీఫైనల్లో వెనుదిరగడం ఇది రెండోసారి. 2018లోనూ ఆమె సెమీఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top