శృతి మించిన పీఎస్‌జీ టైటిల్‌ సంబరాలు | PSG Fans Set Fires, Scuffle With Police After Champions League Title Win, Celebrations In Paris Turn Violent | Sakshi
Sakshi News home page

శృతి మించిన పీఎస్‌జీ టైటిల్‌ సంబరాలు

May 31 2026 11:52 AM | Updated on May 31 2026 2:39 PM

PSG fans set fires, scuffle with police after Champions League title win

ఫ్రాన్స్ లీగ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌  (పీఎస్‌జీ) జట్టు వరుసగా రెండో సారి యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. హంగేరీ రాజధాని బూడాపెస్ట్‌లో నిన్న జరిగిన ఫైనల్లో ఆర్సెనల్‌ ఎఫ్‌సీను పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది. అక్కడ పీఎస్‌జీ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించారు.

అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే పారిస్ నగరంలో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రసిద్ధ ఛాంప్స్‌-ఎలిసిస్‌ ప్రాంతంలో భారీగా అభిమానులు గుమికూడారు. బాణాసంచా పేల్చడం, ఫ్లేర్లు వెలిగించడం, రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించడం కనిపించింది. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన వేడుకలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి.

కొన్ని ప్రాంతాల్లో అభిమానులు మంటలు పెట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, దుకాణాలపై దాడులకు పాల్పడినట్లు ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ముఖ్యంగా పీఎస్‌జీ స్వస్థల మైదానం పార్క్‌ డెస్‌ ప్రిన్సెస్‌ పరిసరాల్లో, అలాగే నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు–పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

గత రాత్రి 11 గంటలకల్లా 130 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గత ఏడాది పీఎస్‌జీ తొలి ఛాంపియన్స్ లీగ్ విజయానంతరం కూడా ఇలాంటి అల్లర్లు చోటుచేసుకోవడంతో ఈసారి ముందస్తుగా దేశవ్యాప్తంగా సుమారు 22 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హింసను పూర్తిగా అరికట్టలేకపోయారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఆరంభంలో ఆర్సెనల్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలో జర్మన్ స్టార్ కాయ్‌ హావెర్ట్జ్‌ గోల్ చేసి ఆర్సెనల్‌కు ఆధిక్యం అందించాడు. అయితే రెండో అర్ధభాగంలో పీఎస్‌జీ తరఫున ఔస్మేన్‌ డెంబెలె పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది.

పెనాల్టీ షూటౌట్‌లో ఆర్సెనల్ డిఫెండర్‌ గాబ్రియల్‌ మగల్హేస్‌ కీలక షాట్‌ను మిస్ చేయగా, పీఎస్‌జీ మిగిలిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చరిత్ర సృష్టించింది. కోచ్ లూయిస్‌ ఎన్రిక్‌ నాయకత్వంలో పీఎస్‌జీ యూరప్ ఫుట్‌బాల్‌లో కొత్త శక్తిగా ఎదుగుతుండగా, పారిస్ వీధుల్లో జరిగిన హింసాత్మక ఘటనలు ఆ విజయోత్సాహాన్ని నీరు గార్చాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement