
ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా బ్యాడ్ రీజన్స్ వల్ల వార్తల్లో నిలిచాడు. ఫామ్ లేమి, వివాదాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ముంబై దేశవాలీ జట్లలో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025 వేలంలోనూ అమ్ముడుపోలేదు.
టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి, భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. స్టేటస్ ఇచ్చిన కిక్కు తలకెక్కడంతో కొద్ది రోజుల్లోనే అదఃపాతాళానికి పడిపోయాడు.
ఈ క్రమంలో తొలుత ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ఆతర్వాత విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా.. ఇటీవలే మహారాష్ట్రకు మకాం మార్చాడు. బుచ్చిబాబు టోర్నీలో అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. పృథ్వీ షా చెన్నై వేదికగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ తర్వాత చాలామంది అభిమానుల్లాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్‌కే కూడా షాను ప్రశంసించింది.
First 💯 for Maharashtra in Chennai✅
Shaw makes it special 💛#WhistlePodu #BuchiBabu pic.twitter.com/o5zGZA2MlU— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2025
తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో షా మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో షా చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి చెన్నై అంటే చాలా ప్రత్యేకమని చెబుతాడు.
ఈ వీడియోలో షా మాట్లాడిన తీరు, సీఎస్‌కే యాజమాన్యం అతనికి ప్రత్యేకంగా ఇచ్చిన ఎలివేషన్ చూస్తే వారి మధ్య ఏదో జరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా సీఎస్‌కే యాజమాన్యం ఎప్పుడూ, తమ వాడు కాని ఏ ఆటగాడికి ఇంత హైప్ ఇవ్వదు. ఇవ్వలేదు.
అలాంటిది సీఎస్‌కే షాను ప్రత్యేకించి ప్రమోట్ చేయడం చూస్తే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వీరి మధ్య డీల్ కుదిరిందా అని అనిపించకమానదు. సీఎస్‌కే హ్యాండిల్‌లో షా వీడియో చూసిన తర్వాత అభిమానులు ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. ఒకవేళ ఇదే జరిగితే షా వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆయుశ్ మాత్రేతో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.