‘ఈ మ్యాచ్‌తో ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్ టాస్ సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పిన మాట ఇది. రైజర్స్ బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ సబ్‌గా హింగే రావాల్సింది.
నిరాశకు లోనైన హింగే
దురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్ ఉనాద్కట్‌ను రైజర్స్ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ చాన్స్ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం.
Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026
అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్‌లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్ రాయల్స్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.
దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్ 2024–25 సీజన్‌తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్‌గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27 వికెట్లు పడగొట్టాడు.
కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్‌కు ఐపీఎల్‌కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్ యాదవ్‌ను అభిమానించే ప్రఫుల్ అభిమాన బౌలర్ ప్యాట్ కమిన్స్. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ ఒక్కసారిగా సీన్‌లోకి రాలేదు.
ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?
2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన పేస్ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు.
విదర్భ టి20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ ట్రయల్స్‌లో జట్టు బౌలింగ్ కోచ్ ప్రఫుల్ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్‌రైజర్స్ తీసుకుంది.
మరోవైపు.. బిహార్‌కు చెందిన పేసర్ సాకిబ్ హుస్సేన్ కూడా ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్ రూ. 30 లక్షలకు ఎంచుకుంది.


