PAK vs AUS: రిజ్వాన్‌పై వేటు.. కొత్త ముఖాలకు చోటు | PCB Announce ODI Squad For Australia Series, Shaheen Afridi Retained As Captain, Babar Azam Returns, Rizwan Dropped | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అతడే.. రిజ్వాన్‌పై వేటు

May 22 2026 12:40 PM | Updated on May 22 2026 4:55 PM

PCB Annonce ODI Squad For Australia Series Babar In Rizwan Axed

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని కెప్టెన్‌గా కొనసాగించింది. ఇక ఈ సిరీస్‌తో బాబర్‌ ఆజం తిరిగి వన్డే జట్టుతో చేరనుండగా.. మరో మాజీ సారథి మహ్మద్‌ రిజ్వాన్‌పై సెలక్టర్లు వేటు వేశారు.

కెప్టెన్‌గా అతడే.. 
కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టిన పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. అయితే, సెలక్టర్లు అప్పుడు బాబర్‌ను ఈ జట్టుకు ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన పాక్‌... షాహిన్‌ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాకు దాదాపు పదకొండేళ్ల తర్వాత 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.

ఈ నేపథ్యంలో షాహిన్‌పై వేటు వేసి.. బాబర్‌కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, సెలక్టర్లు మాత్రం ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌పై నమ్మకం ఉంచారు. అదే విధంగా సల్మాన్‌ ఆఘాను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగించారు.

ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు
ఇక ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపిక కాని నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌లకు సెలక్టర్లు తాజాగా పిలుపునిచ్చారు. వీరితో పాటు ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు కూడా ఆసీస్‌తో వన్డేలు ఆడే జట్టులో చోటిచ్చారు.

అహ్మద్‌ దనియాల్‌, అరాఫత్‌ మిన్హాస్‌, రొహైల్‌ నాజిర్‌లు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ముహమ్మద్‌ ఘాజి ఘోరితో పాటు నాజిర్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక అనారోగ్యం కారణంగా మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఓపెనర్లుగా వీరే
ఇక సయీమ్‌ ఆయుబ్‌, ఫఖర్‌ జమాన్‌ గాయాల కారణంగా దూరం కాగా.. వారి స్థానంలో ఓపెనర్లుగా సాహిబ్‌జాదా ఫర్హాన్‌, మాజ్‌ సదాకత్‌ ఆసీస్‌తో వన్డే బరిలో దిగనున్నారు. మరోవైపు.. పేస్‌ దళంలో కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిదితో పాటు హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా ఉండనే ఉన్నారు. 

స్పిన్నర్ల కోటాలో అబ్రార్‌ అహ్మద్‌, సూఫియాన్‌ ముకీమ్‌ చోటు దక్కించుకున్నారు. కాగా గత పర్యటనలో రిజ్వాన్‌ కెప్టెన్సీలో పాక్‌ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి వన్డే సిరీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాతో వన్డేలకు పాకిస్తాన్‌ జట్టు
షాహిన్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), సల్మాన్‌ ఆఘా (వైస్‌ కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అబ్రార్‌ అహ్మద్‌, అహ్మద్‌ దనియాల్‌, అరాఫత్‌ మిన్హాస్‌, బాబర్‌ ఆజం, హ్యారిస్‌ రవూఫ్‌, మాజ్‌ సదాకత్‌, ముహమ్మద్‌ ఘాజి ఘోరి (వికెట్‌ కీపర్‌), నసీం షా, రొహైల్‌ నాజిర్‌ (వికెట్‌ కీపర్‌), సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షాదాబ్‌ ఖాన్‌, షామిల్‌ హుసేన్‌, సూఫియాన్‌ ముకీమ్‌.

షెడ్యూల్‌
మే 30 (రావల్పిండి), జూన్‌ 2, జూన్‌ 4 (లాహోర్‌) తేదీల్లో పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు.

చదవండి: సన్‌రైజర్స్‌కు తప్పని గండం.. అలా అయితేనే టాప్‌-2లో చోటు!

Advertisement
 
Advertisement
Advertisement