
పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ 33 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపించే అలీ.. 2018లో అరంగేట్రం చేసి 21 వన్డేలు (121.7 స్ట్రయిక్‌రేట్‌తో 3 హాఫ్ సెంచరీల సాయంతో 382 పరుగులు), 58 టీ20లు (133.9 స్ట్రయిక్‌రేట్‌తో 15.2 సగటున 577 పరుగులు) ఆడాడు.
2021 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అలీ కెరీర్ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఓటమి కొరల్లో ఉన్న పాక్‌ను అలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి (7 బంతుల్లో 25 నాటౌట్) గెలిపించాడు.
2022 ఆసియా కప్ సందర్భంగా అలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తోనే హైలైటయ్యాడు. అయితే ఈసారి అతనికి నెగిటివ్ ఇంప్రెషన్ పడింది. సూపర్-4 దశలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అలీ ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు.
ఔట్ చేశాడన్న కోపంతో బ్యాట్‌తో కొట్టినంత పని చేశాడు. అంపైర్లు, సహచరులు అలీని మైదానం నుంచి బయటికి పంపడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో నసీం షా చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి పాక్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో ప్రవర్తనకు గానూ అలీని ఐసీసీ తీవ్రస్థాయిలో మందలించింది.
అలీ 2023 ఆసియా క్రీడల్లో చివరిగా పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దాదాపు రెండేళ్లుగా అతనికి పాక్ తరఫున అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఫ్రాంచైజీ లీగ్‌లు, దేశవాలీ టోర్నీల్లో కొనసాగుతానని అలీ స్పష్టం చేశాడు.
కాగా, అలీ 2019లో క్యాన్సర్ కారణంగా తన రెండేళ్ల కుమార్తెను కోల్పోయాడు. కూతురును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నా అతను.. నాటి ఇంగ్లండ్ పర్యటనను కొనసాగించాడు. అనంతరం అతను 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టులోనూ జాయిన్ అయ్యాడు.