
యూఏఈపై 41 పరుగుల తేడాతో విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు.
సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్‌దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది.
యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్‌జీత్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది.