
పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన స్కాట్లాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ గెలుపుతో ఇటలీ వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లైంది. తమ చివరి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోకుంటే ఇటలీ పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించినట్లే.
హాగ్ వేదికగా నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఇటలీ 12 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిలియో గే (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. ఆఖర్లో స్టీవార్ట్ (27 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మధ్యలో హ్యారీ మనెంటి (38) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క (3-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. బ్రాడ్ కర్రీ (4-0-38-1), మార్క్ వాట్ (4-0-24-1), క్రిస్ గ్రీవ్స్ (4-0-29-1) కూడా పర్వాలేదనిపించారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ ఆదిలోనే తడబడింది. 29 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జార్జ్ మున్సే (72), కెప్టెన్ బెర్రింగ్టన్ (46 నాటౌట్) స్కాట్లాండ్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
హ్యారీ మనెంటీ (4-0-31-5) అద్భుతంగా బౌలింగ్ చేసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు. మనెంటీ ధాటికి స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ గెలిచిన అనంతరం ఇటలీ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.
🚨 ITALY STUNS SCOTLAND IN THE T20 WORLD CUP QUALIFIERS. 🚨
- Italy can play the 2026 T20 WC. 🤯pic.twitter.com/t0PrGoSDj2— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2025
తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం రావడంతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇటలీ జట్టుకు ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ సారథ్యం వహిస్తున్నాడు. బర్న్స్ ఆసీస్ తరఫున 23 టెస్ట్‌లు ఆడి, ఆతర్వాత ఇటలీకి వలస వచ్చాడు.