ఐపీఎల్-2026లో బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్లర్ సినిమాను తలపించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
అద్భుతమైన ఇన్నింగ్స్‌తో హీరోగా మారుతాడు అనుకున్న డేవిడ్ మిల్లర్ ఒక్క తప్పిదంతో విలన్‌గా మారిపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికి విప్రజ్ ఔటయ్యాడు.
మూడో బంతికి కుల్దీప్ మిల్లర్‌కు సింగిల్ తీసి ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. అయితే ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. మిల్లర్ స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు.
కానీ మిల్లర్ అనుకున్నది జరగలేదు. ఆఖరి బంతి ప్రసిద్ద్ బౌన్సర్‌గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సింది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్‌నే కోల్పోవల్సింది. ఓటమి అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు మిల్లర్‌ను ఓదార్చారు.
అయితే ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అసలేంటి ఆ రూల్? ఢిల్లీ ఓటమికి ఎలా కారణమైందో ఓసారి పరిశీలిద్దాం.
ఏమి జరిగిందంటే?
ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో నిస్సాంక ఔటయ్యక నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతి నితీష్ రాణా ప్యాడ్లకు తగిలింది. అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే వేలెత్తి అవుట్ అని ప్రకటించాడు. అప్పటికే రాహుల్, నితీశ్ పరుగు పూర్తి చేశాడు. నితీష్ రాహుల్‌తో చర్చించి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియర్‌గా బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే నితీశ్ తీసిన రన్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్‌ను అవుట్ అని ప్రకటించిన మరుక్షణమే ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది. ఆ తర్వాత బంతి బౌండరీకి వెళ్లినా లెక్కలోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే జరిగింది. నిర్ణయం మారినప్పటికీ అప్పటికే బాల్ డెడ్ కావడంతో బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును అంపైర్లు నిరాకరించారు. ఆఖరికి ఢిల్లీ జట్టు కేవలం 1 పరుగు తేడాతోనే ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ పరుగు ఇచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేది.
చదవండి: PSL 2026: డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్?


