
ఆసియాకప్ హాకీ టోర్నమెంట్-2025 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ టీమ్ తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరగనున్నది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఆసియా కప్ కోసం భారత్‌కు ప్రయాణించకూడదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తొలుత ఈ టోర్నీలో పాల్గోనేందుకు పాక్ జట్టు వీసాలకు ధరఖాస్తు చేసింది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. భారత ప్రభుత్వం కూడా పాక్ ఆటగాళ్ల వీసాలను ఆమోదించడానికి సిద్దంగా ఉందంట. కానీ అంతలోనే పాక్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
"పీహెచ్ఎఫ్ బుధవారం ఆసియా హాకీ సమాఖ్యకు ఒక లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్‌లో పోటీ పడలేమని అందులో పేర్కొంది. తమ దేశంలో ఆడేందుకు బంగ్లాదేశ్ హాకీ జట్టును పాక్ ఆహ్వానించింది" అని హాకీ ఇండియా అధికారి ఒకరు ది హిందూకు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. అపరేషన్ సింధూర్ పేరిట పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ప్రతిస్పందనగా దాడికి యత్నించగా భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతవారణం నెలకొంది.
ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. ఈ క్రమంలో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఛాంపియన్‌తో మ్యాచ్‌లను ఇండియా లెజెండ్స్ బహిష్కరించింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది సమర్ధించారు.
అయితే ఆసియాకప్-2025 క్రికెట్ టోర్నీలో మాత్రం భారత్-పాక్ జట్లు తలపడే అవకాశముంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌ను కూడా భారత్ బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చదవండి: టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌కు ప్రమోషన్.. ఆ జట్టు కెప్టెన్‌గా