నితీశ్‌... ముందుంది మంచి కాలం | Nitish Kumar Reddy is part of the plan to replace Hardik | Sakshi
Sakshi News home page

నితీశ్‌... ముందుంది మంచి కాలం

May 22 2026 2:48 AM | Updated on May 22 2026 12:55 PM

Nitish Kumar Reddy is part of the plan to replace Hardik

సెలెక్టర్ల విశ్వాసం చూరగొన్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌

మున్ముందు హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేసే ప్రణాళికలో భాగం

బౌలింగ్‌లో పెరిగిన వేగం... బ్యాటింగ్‌లో మరింత మేటి

అఫ్గాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టులోకి ఎంపిక

ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ అపార విశ్వాసం వ్యక్తం చేస్తోంది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్న నితీశ్‌... భవిష్యత్తులో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు నిర్వర్తించడగలడని సెలెక్టర్లు నమ్ముతున్నారు. జాతీయ జట్టు తరఫున టెస్టు, వన్డే, టి20ల్లో కలిపి 18 మ్యాచ్‌లాడిన నితీశ్‌ రెడ్డి... 586 పరుగులు చేయడంతో పాటు... 11 వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక ఆటగాడిగా ఎదిగిన నితీశ్‌... ఈ సీజన్‌లో 235 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీశాడు. రోజు రోజుకూ అతడి బౌలింగ్‌లో పదును పెరుగుతుండగా... ఇదే జోరు కొనసాగిస్తే నితీశ్‌ సుదీర్ఘ కాలం పాటు జాతీయ జట్టుకు సేవలందించడం ఖాయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్‌ వేగం పెంచుకోవడం వెనక నితీశ్‌ కష్టాన్ని ఓసారి పరిశీలిస్తే....  –సాక్షి, క్రీడా విభాగం  

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలగడంతో పాటు... లోయర్‌ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటింగ్‌ చేయగల బ్యాటర్‌కు ఏ జట్టులోనైనా ప్రత్యేక గుర్తింపు దక్కడం సహజమే. ఐపీఎల్‌ మెరుపులతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్‌ పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ బాధ్యతను చాన్నాళ్లుగా నిర్వర్తిస్తున్నాడు. కెరీర్‌ ఆరంభంలో టెస్టుల్లో సైతం అతడు ఇలాంటి దూకుడే కనబర్చాడు. 

2018 దక్షిణాఫ్రికా పర్యటనలో హార్దిక్‌ తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే గాయాల కారణంగా అతడి టెస్టు కెరీర్‌ సాఫీగా సాగలేదు. వన్డే, టి20ల్లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే టెస్టు ఫార్మాట్‌కు దూరమవడమే సరైందని భావించి అతడు కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లపైనే దృష్టి సారించాడు. అతడి బాటలోనే ఐపీఎల్‌ మెరపులతో భారత జట్టు తలుపు తట్టిన నితీశ్‌ రెడ్డి... ఇప్పుడు హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. 

హార్దిక్‌ ప్రస్తుత వయసు 32 కాగా... నితీశ్‌ 22 ఏళ్ల యువకుడు. పాండ్యా ఇంకెంతో కాలం జాతీయ జట్టుకు సేవలు అందించలేడనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు నితీశ్‌ రెడ్డికి విరివిగా అవకాశాలు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. కెరీర్‌ ఆరంభంలోనే ఆ్రస్టేలియా పర్యటనలో అనూహ్య సెంచరీతో అంచనాలను అమాంతం పెంచేసిన నితీశ్‌ రెడ్డి... అన్నీ ఫార్మాట్లలో అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. అందుకోసం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. 

వన్డే ప్రపంచకప్‌ కోసం... 
అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం... అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ తాజాగా జట్లను ప్రకటించగా... రెండింట్లోనూ నితీశ్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా అగార్కర్‌ చేసిన వ్యాఖ్యలు ఆలోచనలో పడేశాయి. ‘ఇటీవలి కాంలో నితీశ్‌ బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. అతడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే... మా జట్టులో అతడు కీలక సభ్యుడు’ అని అగార్కర్‌ అన్నాడు. 

గతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే నితీశ్‌... ఇటీవల వేగాన్ని పెంచుకున్న మాట వాస్తవమే. ఇప్పుడతడు గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. గతంలో లోపించిన కచ్చితత్వం సైతం తాజాగా దర్శనమిస్తోంది. దీంతో హార్దిక్‌ రిప్లేస్‌మెంట్‌గా నితీశ్‌ను భావిస్తున్నట్లు అవగతమవుతోంది. నితీశ్‌ సాధన సమయంలో బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు కోచ్‌లు సైతం వెల్లడిస్తున్నారు. వేగంతో పాటు కచ్చితత్వం కోసం ప్రయత్నిస్తున్నాడని... నితీశ్‌లో వచ్చిన ఈ మార్పు భారత బౌలింగ్‌ దళాన్ని మరింత పటిష్టం చేస్తుందని అంటున్నారు. 

ప్రత్యేక శిక్షణ... 
బౌలింగ్‌లో మరింత మెరుగయ్యేందుకు నితీశ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ‘గతంలో నితీశ్‌ బౌలింగ్‌లో ఓ నిర్లిప్తత ఉండేది. ఏదో నిద్రలో ఉన్నట్లు అనిపించేది. అందులో ప్రధానమైన మార్పు వచ్చింది. శిక్షణా పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. వారం రోజుల సెషన్‌లలో నైపుణ్యాలను మెరుగు పర్చడంతో పాటు... వేసే ప్రతి బంతిని పూర్తిస్థాయి సామర్థ్యంతో విసిరేలా శిక్షణ అందించాం. అలసట తగ్గించడంతో... వేగం మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టగలుగుతున్నాడు. పదే పదే ఇదే శిక్షణ రిపీట్‌ చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించాం. 

బరువైన బంతులతో కాసేపు... తేలిక బంతులతో కాసేపు ప్రాక్టీస్‌ చేయించి మరిన్ని ఆప్షన్స్‌ సిద్ధం చేశాం’ అని ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ స్టెఫాన్‌ జోన్స్‌ తెలిపాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌ వరుణ్‌ అరోన్‌ కూడా వాటిని అదే విధంగా కొనసాగిస్తుండటంతోనే ఫలితాలు వస్తున్నాయని అతడు వెల్లడించాడు. గతంలోవరుణ్‌ అరోన్‌కు సైతం వ్యక్తిగతంగా సహకరించిన జోన్స్‌... ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గానూ వ్యవహరించాడు.

రనప్‌ పెంచితే లాభాలెక్కువ... 
నితీశ్‌ వంటి పేసర్‌... బౌలింగ్‌ రనప్‌ పెంచుకుంటే అధిక లాభాలు ఉంటాయని జోన్స్‌ అన్నాడు. అతడి శరీరాకృతికి లాంగ్‌ రనప్‌ సరైందని అప్పుడే ఎక్కువ వేగం పుడుతుందని జోన్స్‌ అభిప్రాయపడ్డాడు. ‘బౌలింగ్‌ చేసే సమయంలో నితీశ్‌ మరింత దూరం నుంచి పరిగెత్తుకు రావాలి. అప్పుడే అతడి వేగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్చర్‌ బౌలింగ్‌ శైలిని అనుకరిస్తే మంచిది. నితీశ్‌ స్వతహాగా మంచి అథ్లెట్‌... కేవలం అతడి సామర్థ్యాన్ని వెలికి తీయడమే మా పని’ అని అన్నాడు. 

పేస్‌ బౌలర్‌కు వేగమే ప్రధానమైన గుర్తింపు అని... అదే ఏ ఫార్మాట్‌లోనైనా మిమ్మల్ని గొప్ప బౌలర్‌గా తీర్చిదిద్దుతుందని జోన్స్‌ అభిప్రాయపడ్డాడు. పెరిగిన వేగంతో నితీశ్‌ మరింత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయగలడని... భవిష్యత్తులో అతడు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా నిలవడం ఖాయమని జోన్స్‌ ఆశాభావం వ్యక్తంచేశాడు. నితీశ్‌ బౌలింగ్‌ మరింత మెరుగయ్యేంత వరకు అతడితో సుదీర్ఘ కాలం కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేదని జోన్స్‌ వెల్లడించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement