'సూపర్‌' సమీర్‌ | Mumbai Indians lost to Delhi Capitals by 6 wickets | Sakshi
Sakshi News home page

'సూపర్‌' సమీర్‌

Apr 5 2026 4:08 AM | Updated on Apr 5 2026 4:08 AM

Mumbai Indians lost to Delhi Capitals by 6 wickets

51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90  

ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో విజయం 

6 వికెట్ల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్‌

గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్‌ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్‌ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్‌ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.

న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు... ఐపీఎల్‌ 19వ సీజన్‌లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్‌ పటేల్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌... శనివారం ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. 

ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించగా...రోహిత్‌ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. 

అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సమీర్‌ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్‌ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించాడు. 2025 సీజన్‌ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకోవడం విశేషం.  

నాలుగే సిక్స్‌లు... 
గత మ్యాచ్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో  చెలరేగారు. ముకేశ్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (9), హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (0) పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 

అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌ వెనుదిరగగా... షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సాంట్నర్‌ (18 నాటౌట్‌; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్‌ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి.  

హార్దిక్‌ స్థానంలో సూర్యకుమార్‌... 
గత మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

సమీర్‌ సెంచరీ మిస్‌... 
గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్‌ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్‌ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ సమీర్‌ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. 

సాంట్నర్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్‌ ఠాకూర్‌ ఓవర్‌లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్‌ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్‌... మయాంక్‌ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. 

ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్‌ చాహర్‌ ఓవర్‌లో 4, 6... శార్దుల్‌ ఓవర్‌లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో బాష్‌ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్‌ (21 నాటౌట్‌; 4 ఫోర్లు), స్టబ్స్‌ (3 నాటౌట్‌) మిగిలిన పనిపూర్తి చేశారు.  

17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (18) అగ్రస్థానంలో ఉంది.

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 9; రోహిత్‌ (సి) నితీశ్‌ రాణా (బి) అక్షర్‌ 35; తిలక్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ 0; సూర్యకుమార్‌ (ఎల్బీ) ఎన్‌గిడి 51; రూథర్‌ఫోర్డ్‌ (సి) ముకేశ్‌ (బి) విప్రాజ్‌ 5; నమన్‌ (సి) స్టబ్స్‌ (బి) నటరాజన్‌ 28; సాంట్నర్‌ (నాటౌట్‌) 18; బాష్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్‌: ముకేశ్‌ 3–0–26–2; ఎన్‌గిడి 4–0–34–1; అక్షర్‌ 4–0–22–1; విప్రాజ్‌ 3–0–24–1; కుల్దీప్‌ 3–0–31–0; నటరాజన్‌ 3–0–24–1. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రికెల్టన్‌ (బి) దీపక్‌ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్‌ 44; నితీశ్‌ రాణా (రనౌట్‌) 0; సమీర్‌ రిజ్వీ (సి) తిలక్‌ (బి) బాష్‌ 90; మిల్లర్‌ (నాటౌట్‌) 21; స్టబ్స్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్‌ 3–0–22–1; శార్దుల్‌ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్‌ బాష్‌ 3.1–0–39–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement