బుమ్రా షాట్‌.. ఆసీస్‌ బౌలర్‌కు గాయం

Mohd Siraj Quickly Rushed To Check Cameron Green By Bumrah Shot - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట జస్‌ప్రీత్‌ బుమ్రా అర్థసెంచరీతో ఆ‍కట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో బుమ్రా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో  స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ షాట్‌ పొరపాటున గ్రీన్‌ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్‌ పిచ్‌లోనే కూలబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న మహ్మద్‌ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి పరుగు పూర్తి చేయకుండా అతని వద్దకు పరిగెత్తాడు. అంపైర్‌ వెంటనే ఫిజియోను రప్పించడంతో మైదానంలో కాసేపు హైటెన్షన్‌ నెలకొంది.

అయితే గ్రీన్‌ గాయం పరిస్థితి ఎలా ఉందనేది సమాచారం అందలేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే గ్రీన్‌ తొలి టెస్టు ఆడడం అనుమానమే. ఇప్పటికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తొలి టెస్టుకు దూరం కావడం.. మరో ఆటగాడు విన్‌ పుకోవిస్కి త్యాగి బౌన్సర్‌కు గాయపడడం.. తాజాగా గ్రీన్‌కు దెబ్బ తగలడంతో ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ఆందోళనలో ఉంది. (చదవండి : సిక్స్‌తో బుమ్రా హాఫ్‌ సెంచరీ.. వీడియో వైరల్‌)


కాగా తొలి రోజు ఆటలో భాగంగా భారత్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఆరంభించారు. కాగా, మయాంక్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోగా, పృథ్వీ షౠ(40) రాణించాడు. అనంతరం శుబ్‌మన్‌ గిల్‌(43) కూడా మెరిశాడు. ఆపై వరుసగా ఆరుగురు ఆటగాళ్లు విఫలం కాగా, బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ఈ జోడి 71 పరుగులు జత చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.  ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. సదర్‌లాండ్‌ బౌలింగ్‌ సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ కావడం విశేషం.  బుమ్రా హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్‌(22) పదో వికెట్‌గా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. (చదవండి : బీకేర్‌ ఫుల్‌.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top