నోరు మూసుకో అక్తర్‌.. కలలు కనటం మానేయ్‌: ఆసిఫ్‌

Mohammad Asif: I Called Shoaib Akhtar Told Him Shut Up On 2007 Spat - Sakshi

ఇస్లామాబాద్‌: ‘‘షోయబ్‌ అక్తర్‌ పదమూడేళ్లపాటు ఆ గొడవను పట్టుకునే వేలాడాడు. వీలు చిక్కినప్పుడల్లా నా గురించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం గురించి నేను తనతో మాట్లాడాలనుకున్నాను. అందుకే ఇటీవల అక్తర్‌కు కాల్‌ చేశాను. దయచేసి నోరు మూసుకో ఇక. అదంతా గతం. ఆ విషయం గురించి మర్చిపో అని చెప్పాను’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాక్‌ బౌలర్లు షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌ల మధ్య డ్రెస్సింగ్‌రూంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. షాహిద్‌ ఆఫ్రిది, ఆసిప్‌ మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన అక్తర్‌.. తన గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నారని భావించి వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనలో ఆసిఫ్‌ను బ్యాట్‌తో కొట్టగా.. అతడి తొడకు గాయమైంది.

ఈ వివాదం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. దీంతో, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అక్తర్‌ను టీ20 వరల్‌​‍్డ కప్‌ నుంచి తప్పిస్తూ స్వదేశానికి పిలిపించింది. అయితే, ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అక్తర్‌, ఆసిఫ్‌ను క్షమాపణ కోరడంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసిపోయింది. కానీ, నేటికి కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది.

నీకు అంతలేదు.. వాస్తవంలోకి రా!
ఈ క్రమంలో ఇటీవల షాహిద్‌ ఆఫ్రిది ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను జోక్‌ చేస్తే, అక్తర్‌ సీరియస్‌ అయ్యాడని, దీంతో గొడవ జరిగిందని చెప్పాడు. ఆవేశంలో అతడు తప్పు చేశాడని పేర్కొన్నాడు. ఇక తాజాగా ఈ ఘటన గురించి ఆసిఫ్‌ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. అంతేకాకుండా.. అక్తర్‌ కలలు కనడం మానేసి యువ క్రికెటర్లకు సాయం చేస్తే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు.

 ‘‘ఒకరోజు,  తాను చీఫ్‌ సెలక్టర్‌ అవుతానని, మరోరోజు పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌.. అదీ కాదంటే ఏకంగా పీసీబీ చైర్మన్‌ అవుతానని అక్తర్‌ కలలు కంటూ ఉంటాడు. అతడు వాస్తవంలో బతకాలి. 2007 నాటి ఘటనను పట్టుకుని, పదే పదే దాని గురించి మాట్లాడుతూ.. సమయం వృథా చేసే బదులు వర్ధమాన క్రికెటర్లకు తన వంతు సాయం చేస్తే బాగుంటుంది’’అని హితవు పలికాడు.

చదవండి: గంగూలీది కష్టపడే తత్వం కాదు.. కానీ: చాపెల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top