Moeen Ali Reveals That Ben Stokes Was The Reason Behind His Test Retirement Withdrawal - Sakshi
Sakshi News home page

#MoeenAli: స్టోక్స్‌ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది

Published Wed, Jun 14 2023 10:56 AM

Moeen Ali Reveals One-Word Message From Ben Stokes-Test comeback - Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఇటీవలే టెస్ట్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అలా రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్నాడో లేదో ఈసీబీ అతన్ని ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కోసం ఎంపిక చేసింది. ఇక జూన్‌ 16 నుంచి మొదలుకానున్న యాషెస్‌ సిరీస్‌ కోసం మొయిన్‌ అలీ సిద్ధమవుతున్నాడు. జాక్‌ లీచ్‌ గైర్హాజరీలో మొయిన్‌ అలీ జట్టు బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు.

అయితే టెస్టు రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్‌స్టోక్స్‌ అని మొయిన్‌ అలీ రివీల్‌ చేశాడు.  స్టోక్స్‌ చెప్పిన యాషెస్‌ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మొయిన్‌ అలీ మాట్లాడాడు.

''స్టోక్స్‌ నేను సరదాగా చాట్‌ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్‌?(Ashes?) అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్‌ లీచ్‌ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్‌(Lol) అని మెసేజ్‌ చేశా. అంతే స్టోక్స్‌ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్‌ లీచ్‌ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్‌కు ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్‌లో నీ అవసరం ఉందని స్టోక్స్‌ నాతో అన్నాడు.

రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్‌ నన్ను కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. అందునా యాషెస్‌ అనే పదం వినగానే నాలో ఉత్సాహం వచ్చింది.. ఆడాలని నిశ్చయించుకున్నా. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు బెన్‌స్టోక్స్‌ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ వివరించాడు. 

మొయిన్‌ అలీ కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడి 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు.  ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్‌.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్‌ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇక స్టోక్స్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ టెస్టుల్లో దూసుకుపోతుంది. బజ్‌బాల్‌ విధానంతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లీష్‌ జట్టు స్టోక్స్‌ కెప్టెన్సీలో 13 టెస్టుల్లో 11 విజయాలు నమోదు చేయడం విశేషం. 2015 తర్వాతి నుంచి మరో యాషెస్‌ గెలవని ఇంగ్లండ్‌ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను ఓడించి యాషెస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

చదవండి: అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్‌.. అభిమానులకు పండగే!

Advertisement

తప్పక చదవండి

Advertisement