
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హెచ్‌సీఏ ఎన్నికలపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. అధ్యక్షుడిగా జగన్మోహనరావు దొడ్డిదారిన ఎంపికైనట్లు గుర్తించింది. 23 ఇన్‌స్టిట్యూషన్లకు సంబంధించిన ఓట్లను అతడు అక్రమంగా వేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఓట్ల ద్వారానే అతడు గెలిచినట్లు తేలింది.
ఇలా పలు ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున తరఫున ప్రతినిధులను ఓటింగ్‌కు అర్హులుగా చేసి.. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ గత ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారో.. వారిని విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఎవరి ఒత్తిడితో వీరు ఓట్లు వేశారు అనేదానిపై విచారణ చేపట్టింది.
కాగా ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించి.. అదనపు ప్రయోజనాలు పొందాలని చూసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు జైలుపాలైన విషయం తెలిసిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అధ్యక్షుడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది.
అంతేకాదు.. ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది. తాజాగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్లు గుర్తించడం గమనార్హం.
