ఐపీఎల్-2026లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భుజం, మోచేయి గాయాలతో బాధపడుతున్న స్టార్క్, కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
దీంతో అతడు ఢిల్లీ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏప్రిల్ 20 తర్వాతే ఢిల్లీ క్యాంప్‌లో చేరే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లలో ఏప్రిల్ 8న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
అయితే స్టార్క్ గైర్హజరీలో ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ను లుంగి ఎంగిడీ, ముఖేష్ కుమార్, టి.నటరాజన్‌లు సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉంట జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. స్టార్క్ ఇటీవల తన గైర్హాజరీపై భారత మీడియాలో వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించాడు.
భారత మీడియాలో నా గైర్హాజరీపై రకరకాల కథనాలు ప్రచురిస్తున్నారు. కానీ అవన్నీ ఆ వాస్తవం. ఆస్ట్రేలియా సమ్మర్ సీజన్‌లో భుజం, మోచేయికి గాయాలయ్యాయి. వాటి తీవ్రత అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు వాటికి చికిత్స తీసుకుంటున్నాను అని స్టార్క్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్టార్క్‌ను ఐపీఎల్-2026కు ముందు రూ.11.75 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు


