ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు. సిడ్నీలోని మారుబ్రాలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మరూబ్రాలోని మలబార్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఆ సమయంలో అటుగా వస్తున్న వార్నర్ చెకింగ్ పాయింట్‌ను చూసి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు అనుమానంతో అక్కడి వెళ్లి వార్నర్‌ను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో అతడు పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.
వెంటనే అతడిని మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండో సారీ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా ఉన్నట్లు తేలింది. ఇది ఆస్ట్రేలియాలోని అనుమతించిన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో వార్నర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. అనంతరం అతడిని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో వారి తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ రావడంతో తన ఫ్యామిలీతో గడిపేందుకు వార్నర్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అయితే అతడు తిరిగి ఏప్రిల్ 7న పాకిస్తాన్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.
చదవండి: నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్ ఫైర్


