ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | Michael Vaughan Slams ECB-BCCI deal as Jofra Archer stays for IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

May 18 2026 11:01 AM | Updated on May 18 2026 11:14 AM

Michael Vaughan Slams ECB-BCCI deal as Jofra Archer stays for IPL

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌-2026లో అదరగొడుతున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు కూల్చాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌
ఇక ఈ సీజన్‌ లీగ్‌ దశలో భాగంగా రాజస్తాన్‌కు ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు.

ప్రధాన పేసర్‌ను కీలక టెస్టులో ఆడించకుండా.. ఐపీఎల్‌లో కొనసాగేందుకు అనుమతించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) బోర్డు తీరును తప్పుబట్టాడు. తానేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదని.. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం దక్కాలని మైకేల్‌ వాన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఈసీబీ-బీసీసీఐ ఒప్పందం వల్ల
క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఆర్చర్‌ తప్పకుండా అందుబాటులోకి వస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జూన్‌ రెండో వారంలో ఈ మ్యాచ్‌ ఉండబోతుంది. ఈసీబీ బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఐపీఎల్‌ పూర్తయ్యేంత వరకు తమ ప్రధాన ఆటగాళ్లు ఇండియాలో ఉండేందుకు అనుమతినిస్తోంది.

సమస్యంతా ఇంగ్లండ్‌ బోర్డులోనే ఉంది. నిజానికి జోఫ్రా ఆర్చర్‌ అరుదైన ఫాస్ట్‌ బౌలర్‌. అతడి పనిభారాన్ని తగ్గించే క్రమంలో కీలక మ్యాచ్‌లకు సైతం విశ్రాంతినిస్తూ ఈసీబీ కాపాడుకుంటూ వస్తోంది. కానీ ఈ కాంట్రాక్టు వల్ల ఇప్పుడిలా అతడి సేవలు కోల్పోవాల్సి వచ్చింది.

నేనే కోచ్‌ అయి ఉంటే..
అంతర్జాతీయ క్రికెట్‌ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్‌ గొప్పది కాదు. నేనే ఒకవేళ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ.. హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ అయి ఉంటే.. జట్టులోని అత్యుత్తమ బౌలర్‌ను.. ఐపీఎల్‌లో కాకుండా.. న్యూజిలాండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్‌ వేదికగా తొలి టెస్టులో ఆడించేవాడిని.

అలాగని నేనేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదు. ఇవన్నీ అద్భుతమైన లీగ్‌లు. మా ఆటగాళ్లు ఈ లీగ్‌లో సత్తా చాటడం చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే, టెస్టుల కంటే ఇతర ఫార్మాట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం
ఒకవేళ ఐపీఎల్‌లో కీలక ఆటగాళ్లను కొనసాగించాలని అనుకుంటే.. ఈసీబీ తమ టెస్టు సమ్మర్‌ క్యాలెండర్‌లో మార్పులు చేయాల్సింది’’ అని మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఐపీఎల్‌-2026లో కొనసాగుతూ.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మార్కస్‌ స్టొయినిస్‌ తదితరులకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఐపీఎల్‌లో కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ లేవనెత్తిన ప్రశ్న క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇది సరైందేనా?
తమపై కోట్లు కుమ్మరించిన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల కోసం విదేశీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ విధులకు డుమ్మా కొట్టడం సరైందా? కాదా? అన్న అంశంపై క్రీడా విశ్లేషకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. 

కాగా న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే.. ఆర్చర్‌ను రాజస్తాన్‌ రూ. 12.5 కోట్లకు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 4 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఇక ఐపీఎల్‌-2026 మే 31న ఫైనల్‌తో ముగియనుంది.

చదవండి: మరో టీ20 టోర్నీని ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ

Advertisement
 
Advertisement
Advertisement