మంచి మనసు చాటుకున్న తిలక్‌ వర్మ.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Tilak Varma: మంచి మనసు చాటుకున్న తిలక్‌ వర్మ.. వీడియో వైరల్‌

Published Fri, Apr 19 2024 3:42 PM

MI vs PBKS Tilak Varma Heartwarming Gesture To Budding Cricketers Video - Sakshi

ముంబై ఇండియన్స్‌ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ మంచి మనసు చాటుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు మద్దతుగా వచ్చిన చిన్నారులకు ఊహించని బహుమతి ఇచ్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. 

ఐపీఎల్‌-2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై విజయంలో తిలక్‌ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ లెఫ్టాండర్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌(78)తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 34 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు తిలక్‌ వర్మ. అంతేకాదు.. ముంబై విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రమాదకరంగా మారిన పంజాబ్‌ కింగ్స్‌ సంచలనం శశాంక్‌ సింగ్‌(25 బంతుల్లో 41) వికెట్‌ పడగొట్టడంలో భాగస్వామ్యమయ్యాడు కూడా!

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ పదమూడో ఓవర్లో జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపాడు. మిడ్‌ వికెట్‌ ఫీల్డ్‌ పొజిషన్‌లో ఉన్న తిలక్‌ వర్మ ఏమాత్రం పొరపాటు చేయకుండా వేగంగా కదిలి క్యాచ్‌ అందుకున్నాడు.

ఇక పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన ముంబై ఎట్టకేలకు తొమ్మిది పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఫలితంగా సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో పంజాబ్‌ గెలుపొందితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు భంగపాటే ఎదురైంది.

ఈ నేపథ్యంలో విజయానంతరం డ్రెస్సింగ్‌రూంకు వెళ్తున్న తరుణంలో తిలక్‌ వర్మ.. టెస్టు జెర్సీలు వేసుకున్న ముగ్గురు అమ్మాయిలు ఇంకా స్టేడియంలో ఉండటాన్ని గమనించి.. తన బ్యాటింగ్‌ గ్లోవ్స్‌ను వారి వైపునకు విసిరాడు.

ఆ ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు గ్లోవ్స్‌ను క్యాచ్‌ పట్టి థాంక్యూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పాటు.. ఓ కీలక క్యాచ్‌ అందుకున్నాడు.

అలాగే ఇద్దరు వర్ధమాన క్రికెటర్లు తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ కారణాన్ని కూడా చూపించాడు. తిలక్‌ వర్మ హ్యాట్సాఫ్‌’’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ 2022లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది టీమిండియాలోనూ అరంగేట్రం చేశాడు.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటికీ ముంబై ఫ్రాంఛైజీతో కొనసాగుతున్న ఈ తెలుగు తేజం తిలక్‌.. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 208 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ముంబై ఈ ఎడిషన్‌లో ఏడింట మూడు విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్‌.. రోహిత్‌ మాట విని అలా! వైరల్‌ వీడియో

Advertisement
 
Advertisement