
ఆసీస్ వెటరన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 10) ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో మరో 4 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన డబుల్‌ను (2500 పరుగులు, 50 వికెట్లు) సాధిస్తాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాక్ మాజీ మొహమ్మద్ హఫీజ్, మలేసియా ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో షకీబ్ అత్యధికంగా 129 మ్యాచ్‌ల్లో 2551 పరుగులు చేసి, 149 వికెట్లు తీయగా.. హఫీజ్ 119 మ్యాచ్‌ల్లో 2514 పరుగులు చేసి, 61 వికెట్లు తీశాడు. విరన్‌దీప్ 102 మ్యాచ్‌ల్లో 3013 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.
మ్యాక్స్‌వెల్ విషయానికొస్తే.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటిదాకా 121 మ్యాచ్‌లు ఆడి 2754 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు.
కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ డార్విన్‌లో (ఆస్ట్రేలియా) జరుగనుంది. రెండో టీ20 ఆగస్ట్ 12న ఇదే డార్విన్‌లో జరుగనుండగా.. మూడో టీ20 ఆగస్ట్ 16న కెయిన్స్ వేదికగా జరుగనుంది.
టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో కెయిన్స్ (తొలి వన్డే), మెక్‌కే (మిగతా రెండు) వేదికలుగా జరుగనున్నాయి.