
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. అతడు బౌలింగ్ దాటికి పసికూన జింబాబ్వే విల్లవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది.
కివీస్ బౌలర్లలో హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో మూడేళ్ల తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు. ఈ క్రమంలో మాట్ హెన్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
జింబాబ్వేపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన న్యూజిలాండ్ బౌలర్‌గా క్రిస్ కెయిర్న్స్ రికార్డును హెన్రీ సమం చేశాడు. కెయిర్న్స్ తన కెరీర్‌లో జింబాబ్వేపై 8 టెస్టులు ఆడి 39 వికెట్లు సాధించాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి. మాట్ హెన్రీ కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.
కాగా తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్(69), కాన్వే(71) ఉన్నారు.
చదవండి: Asia cup 2025: ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..?