IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. సిరీస్‌ చిక్కింది

KL Rahul super innings,India beat SriLanka by 4 wickets - Sakshi

రెండో వన్డేలో భారత్‌ విజయం

2–0తో సిరీస్‌ సొంతం

4 వికెట్లతో ఓడిన శ్రీలంక 

రాణించిన సిరాజ్, కుల్దీప్, రాహుల్‌

ఆదివారం చివరి వన్డే  

భారత్‌ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్‌ 43వ ఓవర్‌ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త తడబడినా, రాహుల్‌ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్‌ గెలుపును అందుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సిరాజ్, కుల్దీప్‌లు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టిపడేశారు. దాంతో కనీస స్కోరు కూడా సాధించలేక శ్రీలంక చేతులెత్తేసింది.   

కోల్‌కతా: టి20 మ్యాచ్‌లోనే 228 పరుగులు నమోదై వారం కూడా కాలేదు. అదే వన్డేలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. శ్రీలంక కనాకష్టంగా స్కోరు చేయగా, దానిని ఛేదించేందుకు భారత్‌ 6 వికెట్లు చేజార్చుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించింది.  మొదట శ్రీలంక 39.4 ఓవర్లలోనే 215 పరుగుల వద్ద ఆలౌటైంది. నువనిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్, సిరాజ్‌  చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (103 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. సిరీస్‌ 2–0తో భారత్‌ గెలుచుకోగా, చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది.  భుజం గాయంతో దూరమైన చహల్‌ స్థానంలో కుల్దీప్‌ ఈ మ్యాచ్‌లోకి వచ్చాడు.  

రాణించిన నువనిదు 
అవిష్క ఫెర్నాండో (20; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అరంగేట్రం చేసిన నువనిదు ఫెర్నాండో పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశాడు. తన ఓవర్లోనే హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన అవిష్కను సిరాజ్‌ మరుసటి ఓవర్లో బౌల్డ్‌ చేశాడు. తర్వాత కుశాల్, నువనిదు ఓవర్‌కు 6 పైచిలుకు రన్‌రేట్‌తో జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చారు. అంతలోనే కుశాల్‌ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను కుల్దీప్‌ ఎల్బీగా పంపడంతో 73 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత స్పిన్, పేస్‌ల వైవిధ్యం లంకను కుదురుకోనివ్వలేదు. ధనంజయ (0)ను అక్షర్‌ డకౌట్‌ చేయగా, అసలంక (15), కెపె్టన్‌ షనక (2)లను కుల్దీప్‌ బోల్తా కొట్టించాడు. హసరంగ (21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటికి ఉమ్రాన్‌ బ్రేకులేయగా, లోయర్‌ ఆర్డర్‌లో దునిత్‌ వెలలగే (34 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చేసిన స్కోరుతో లంక కష్టంగా 200 పరుగులు దాటింది.  

హార్దిక్‌ సహకారం   
లక్ష్యం చిన్నదే అయినా గెలుపు సులువుగా ఏమీ రాలేదు. గత మ్యాచ్‌ ‘టాప్‌ 3’ రోహిత్‌ (17; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (12 బంతుల్లో 21; 5 ఫోర్లు), కోహ్లి (4) తొలి పది ఓవర్లలోపే అవుటైతే గానీ పిచ్‌ సత్తా తెలియలేదు. 62 పరుగులకే వీళ్లంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్స్‌ ముగ్గురే... అయ్యర్, రాహుల్, పాండ్యా! కానీ లక్ష్యదూరం మాత్రం 154 పరుగులు. కీలక దశలో శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. అయితే రాహుల్, హార్దిక్‌ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించింది. 161 స్కోరు వద్ద పాండ్యా అవుటైనా... రాహుల్‌ కడదాకా నిలబడ్డాడు. అక్షర్‌ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌), కుల్దీప్‌ (10 నాటౌట్‌; 2 ఫోర్లు)లతో కలిసి జట్టును గెలిపించాడు. 93 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

స్కోరు వివరాలు 
శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (బి) సిరాజ్‌ 20; నువనిదు రనౌట్‌ 50; మెండిస్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 34; ధనంజయ (బి) అక్షర్‌ 0; అసలంక (సి) అండ్‌ (బి) కుల్దీప్‌ 15; షనక (బి) కుల్దీప్‌ 2; హసరంగ (సి) అక్షర్‌ (బి) ఉమ్రాన్‌ 21; దునిత్‌ (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 32; కరుణరత్నే (సి) అక్షర్‌ (బి) ఉమ్రాన్‌ 17; రజిత నాటౌట్‌ 17; లహిరు (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్‌) 215. వికెట్ల పతనం: 1–29, 2–102, 3–103, 4–118, 5–125, 6–126, 7–152, 8–177, 9–215, 10–215. బౌలింగ్‌: షమీ 7–0–43–0, సిరాజ్‌ 5.4–0–30–3, పాండ్యా 5–0–26–0, ఉమ్రాన్‌ 7–0–48–2, కుల్దీప్‌ 10–0–51–3, అక్షర్‌ 5–0–16–1. 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మెండిస్‌ (బి) కరుణరత్నే 17; గిల్‌ (సి) అవిష్క (బి) లహిరు 21; కోహ్లి (బి) లహిరు 4; అయ్యర్‌ (ఎల్బీ) (బి) రజిత 28; రాహుల్‌ నాటౌట్‌ 64; పాండ్యా (సి) మెండిస్‌ (బి) కరుణరత్నే 36; అక్షర్‌ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219. 
వికెట్ల పతనం: 1–33, 2–41, 3–62, 4–86, 5–161, 6–191. 
బౌలింగ్‌: కసున్‌ రజిత 9–0–46–1, లహిరు 9.2–0–64–2, కరుణరత్నే 8–0–51–2, హసరంగ 10–0–28–0, దునిత్‌ 2–0–12–0, షనక 2–0–6–0, ధనంజయ 3–0–9–1. 

చదవండిIND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్‌! ఇదేమి బుద్దిరా బాబు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top