
ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఇంగ్లండ్ పర్యటన మర్చిపోలేని విధంగా సాగిందని వ్యాఖ్యానించాడు. హెడింగ్లీలో తొలి టెస్టు మొదటి రోజు జాతీయ గీతం పాడుతున్నప్పుడు నేను సాధించగలిగాను అనే గర్వంతో భావోద్వేగానికి లోనయ్యానని అతను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన నాయర్ 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 205 పరుగులు చేశాడు.అయితే చివరి టెస్టులో చేసిన అర్ధసెంచరీ భారత్ విజయానికి కీలకంగా మారింది.
‘ఓవల్ టెస్టులో అర్ధ సెంచరీని శతకంగా మలచలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. అయితే టెస్టు తొలి రోజు కఠిన పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడగలిగాను. మొత్తంగా చూస్తే ఎత్తుపల్లాలతో నా సిరీస్ సాగింది. అయితే ఆ అంకం ముగిసింది. ఇకపై రాబోయే రోజుల్లో నాకు అవకాశం దక్కినప్పుడు భారీ స్కోర్లు సాధించగలనని నమ్ముతున్నా’ అని నాయర్ చెప్పాడు. త్వరలో జరిగే మహరాజా టి20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున కరుణ్ నాయర్ బరిలోకి దిగనున్నాడు.