తొలిరోజు తడబాటు | India made a difficult start to the final Test | Sakshi
Sakshi News home page

తొలిరోజు తడబాటు

Aug 1 2025 1:06 AM | Updated on Aug 1 2025 8:48 AM

India made a difficult start to the final Test

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 204/6

ఆదుకున్న కరుణ్‌ నాయర్‌

టీమిండియాను దెబ్బతీసిన అట్కిన్సన్, టంగ్‌  

సిరీస్‌ సమం కోసం గెలవాల్సిన సమరాన్ని భారత్‌ సరిపోలని ఆటతీరుతో మొదలు పెట్టింది. ప్రతికూల వాతావరణం, కలిసిరాని పిచ్, నిలకడలేని బ్యాటింగ్‌... అన్నీ టీమిండియాకు ప్రతికూలంగా మారాయి. వాన చినుకులు పదేపదే ఇబ్బంది పెట్టిన తొలిరోజు ఆటలో భారత్‌ అడుగడుగునా కష్టాల్నే ఎదుర్కొంది. బ్యాటర్ల వైఫల్యంతో సెషన్, సెషన్‌కు వికెట్లను కోల్పోయిన భారత్‌ మొదటి రోజు అతికష్టంగా 200 పరుగుల స్కోరు దాటింది.   

లండన్‌: చికాకు పెట్టిన చినుకులు, ప్రతికూల పరిస్థితుల మధ్య ఆఖరి టెస్టును భారత్‌ అతిక్లిష్టంగా మొదలు పెట్టింది. విలువైన వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయి కష్టంగా బ్యాటింగ్‌ చేసింది. మరోవైపు సిరీస్‌లో ఇదివరకే ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు... ఆధిపత్యంతో ఐదో టెస్టుకు శ్రీకారం చుట్టింది. సమష్టి బౌలింగ్‌ ప్రదర్శనతో టీమిండియాను బెంబేలెత్తించింది. దీంతో తొలిరోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 

కరుణ్‌ నాయర్‌ (98 బంతుల్లో 52 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (45 బంతల్లో 19 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషభ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురేల్‌ను, వెటరన్‌ సీమర్‌ బుమ్రా, అన్షుల్‌ కంబోజ్, శార్దుల్‌ ఠాకూర్‌ స్థానాల్లో వరుసగా ఆకాశ్‌దీప్, ప్రసిధ్‌ కృష్ణ, కరుణ్‌ నాయర్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. 

మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరమవగా ఒలీ పోప్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్, జోష్‌ టంగ్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. వర్షం కారణంగా తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.  

జైస్వాల్‌ 2, రాహుల్‌ 14... 
టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ కెప్టెన్ ఒలీ పోప్‌ పరిస్థితులను గమనించి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభ ఓవర్లలోనే భారత్‌ను కష్టాల్లోకి నెట్టేశారు. నాలుగో ఓవర్‌ తొలి బంతికే యశస్వి జైస్వాల్‌ (2)ను అట్కిన్సన్, కాసేపటికి కేఎల్‌ రాహుల్‌ (14)ను వోక్స్‌ అవుట్‌ చేశారు. 

సాయి సుదర్శన్‌ (38; 6 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (21; 4 ఫోర్లు) నిలదొక్కుకునే ప్రయత్నాలపై చినుకులు కురవడంతో 72/2 స్కోరు వద్ద ఆట ఆగింది. ముందు వాన... తర్వాత తడారని మైదానం కోసం మ్యాచ్‌ చాలా సేపు నిలిపివేశారు. ఈ లోపే లంచ్‌ బ్రేక్‌ను కానిచ్చారు. ఫీల్డ్‌ అంపైర్లు పిచ్, అవుట్‌ ఫీల్డ్‌ను పరిశీలించిన తర్వాత రెండో సెషన్‌ ఆలస్యంగానే మొదలైంది.  

గిల్‌ నిర్లక్ష్యం 
తొలి సెషన్‌ ఎదురుదెబ్బల నుంచి ఇంకా కోలుకోకముందే రెండో సెషన్‌లో కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ అవుట్‌తో కోలుకోలేని దెబ్బ తగిలింది. బంతి ఫీల్డర్‌ చేతుల్లోకి వెళుతున్న క్రమంలోనే పరుగుకు ప్రయత్నించి గిల్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. కవర్స్‌ దిశగా బంతిని బాదిన శుబ్‌మన్‌... ఫీల్డర్‌ అట్కిన్సన్‌ను సమీపిస్తున్న బంతిని చూసుకోకుండానే పరుగు కోసం సగం పిచ్‌ను దాటేశాడు. సాయి సుదర్శన్‌ వారించినా పట్టించుకోలేదు. 

అట్కిన్సన్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నేరుగా వికెట్లకు (డైరెక్ట్‌ హిట్‌) త్రో చేయడంతో గిల్‌ నిష్క్రమించాడు. దీంతో 45 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం రనౌట్‌తో కూలింది. టెస్టుల్లో శుబ్‌మన్‌ ఇలా రనౌట్‌ కావడం ఇది రెండోసారి. ఏడాది క్రితం రాజ్‌కోట్‌లో అదికూడా ఇంగ్లండ్‌తోనే జరిగిన టెస్టులో అతను రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా (9), ధ్రువ్‌ జురేల్‌ (19) తక్కువే చేశారు.  

నాయర్‌ ఫిఫ్టీ 
భారత బ్యాటింగ్‌ బలగమంతా చేతులెత్తేయడంతో ఒకదశలో 153 పరుగులకే 6 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఇలా క్లిష్టపరిస్థితుల్లో కరుణ్‌ నాయర్‌ టీమిండియా పాలిట ఆపద్భాంధవుడయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి వికెట్‌ను కాపాడుకుంటూనే ఒక్కో పరుగు జతచేస్తూ జట్టు స్కోరును 200 పరుగులు దాటించిన పోరాటం అద్భుతం. ఈ క్రమంలోనే అతను 89 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్‌ 2; రాహుల్‌ (బి) వోక్స్‌ 14; సుదర్శన్‌ (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 38; గిల్‌ (రనౌట్‌) 21; కరుణ్‌ నాయర్‌ (బ్యాటింగ్‌) 52; జడేజా (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 9; జురేల్‌ (సి) బ్రూక్‌ (బి) అట్కిన్సన్‌ 19; సుందర్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153. బౌలింగ్‌: వోక్స్‌ 14–1–46–1, అట్కిన్సన్‌ 19–7–31–2, టంగ్‌ 13–3–47–2, ఓవర్టన్‌ 16–0–66–0, బెథెల్‌ 2–1–4–0.

743 ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా శుబ్‌మన్‌ గిల్‌ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో గిల్‌ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 743 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు సునీల్‌ గావస్కర్‌ (1979లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో 732 పరుగులు) పేరిట ఉండేది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement