
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ ఓ అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ టెస్ట్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ (13492), మహేళ జయవర్దనే (9509), జాక్ కల్లిస్ (9033) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని తాకే క్రమంలో రూట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7564) అధిగమించాడు.
కెరీర్ తొలినాళ్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రూట్.. నాలుగో స్థానానికి మారిన తర్వాత సంచలనాలు నమోదు చేశాడు. ఈ స్థానంలో రూట్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టును గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు.
లంచ్ విరామం తర్వాత రూట్ 31 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా బెన్ స్టోక్స్ (14) ఉన్నాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 129/4గా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 250 పరుగులు చేసినా పెద్ద స్కోరే అవుతుంది. ఈ పిచ్‌పై ఛేజింగ్ చాలా కష్టంగా ఉండనుంది. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను 200లోపు ఆలౌట్ చేస్తేనే ఛేజింగ్‌కు సులువుగా ఉంటుంది.
ఇవాళ తొలి సెషన్‌లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్‌దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు.
బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు.
భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్‌మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్‌దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.