అంపైర్‌పై ఫైర్‌ అయిన కోహ్లి | Jason Holder Catch Controversy, Will Virat Kohli Face IPL Ban For Losing Cool On Umpire | Sakshi
Sakshi News home page

అంపైర్‌పై ఫైర్‌ అయిన కోహ్లి

Apr 30 2026 10:07 PM | Updated on Apr 30 2026 10:07 PM

Jason Holder Catch Controversy, Will Virat Kohli Face IPL Ban For Losing Cool On Umpire

ఐపీఎల్‌ 2026లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ పట్టిన ఓ క్యాచ్‌ (రజత్‌ పాటిదార్‌ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. 

ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్‌తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో విరాట్‌పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?
అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.

సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్‌లో రాణా అంపైర్‌తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్‌కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, హోల్టర్‌ క్యాచ్‌ నిజంగా క్లీన్‌గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. 

వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్‌ అంపైర్‌ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్‌ ఇవ్వడం మాత్రం కరెక్ట్‌ కాదు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ గుజరాత్‌ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. 

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement