
అథ్లెటిక్స్ కెరీర్‌ను ముగించిన జమైకా దిగ్గజం షెల్లీ ఆన్ ఫ్రేజర్
ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల 4 X 100 మీటర్ల రిలేలో జమైకా బృందానికి రెండో స్థానం
టోక్యో: తన 17 ఏళ్ల అంతర్జాతీయ అథ్లెటిక్స్ కెరీర్‌కు జమైకా దిగ్గజం షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ ఘనంగా ముగింపు పలికింది. ఆదివారం ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి ట్రాక్‌పై బరిలోకి దిగిన 38 ఏళ్ల షెల్లీ మహిళల 4–100 మీటర్ల రిలే విభాగంలో జమైకా బృందానికి రజత పతకం అందించింది. షెల్లీ, టియా క్లేటన్, టీనా క్లేటన్, జొనెల్లీ స్మిత్‌లతో కూడిన జమైకా బృందం 41.79 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది.
100 మీటర్లు, 200 మీటర్ల వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్టార్ మెలిస్సా జెఫర్సన్ వుడెన్ తన ఖాతాలో మూడో స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. మెలిస్సా, ట్వానిషా టెర్రీ, కేలా వైట్, షకారి రిచర్డ్‌సన్‌లతో కూడిన అమెరికా రిలే జట్టు 41.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
సినా మేయర్, రెబెకా హాస్, సోఫియా జంక్, గినా లుకెన్‌కెంపర్‌లతో కూడిన జర్మనీ జట్టుకు కాంస్య పతకం లభించింది. 2008 నుంచి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో ఉన్న షెల్లీ తన కెరీర్‌లో 8 ఒలింపిక్ పతకాలు (4 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) గెల్చుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 17 పతకాలు (10 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్య) సొంతం చేసుకుంది.

అమెరికాదే అగ్రస్థానం
ఆదివారంతో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మరోసారి అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గిన కెన్యా 11 పతకాలతో రెండో స్థానంలో... 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం నెగ్గిన కెనడా ఐదు పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 54 దేశాలు కనీసం ఒక కాంస్య
పతకాన్ని సాధించాయి.