
PC: SAI X
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISFF) తాజా సీజన్‌లోని చివరి ప్రపంచకప్‌లో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సత్తా చాటింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు తొలి మెడల్ అందించింది. కాగా చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో తొలి నాలుగు రోజుల్లో భారత్ కనీసం ఒక్క కాంస్య పతకం కూడా నెగ్గలేకపోయింది.
వైఫల్యాల పరంపర
షూటింగ్ ఈవెంట్లో ఇన్ని రోజులైనా కూడా భారత్ బోణీ కొట్టలేకపోవడం బహుశా ఇటీవల ఇదే తొలిసారి!.. పురుషులు, మహిళల ఈవెంట్లలో శుక్రవారం వరకు వరుస వైఫల్యాల పరంపర కొనసాగింది.
శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మెహులీ ఘోష్, మానిని కౌశిక్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. 2023లో బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన మెహులీ క్వాలిఫయింగ్‌లో 583 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది.
ఇక మానిని 580 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమైనింది. తెలంగాణకు చెందిన మరో షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 578 పాయింట్లతో ఏకంగా 52వ స్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ భవేశ్ షెకావత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు.
ఇషాకు ఇదే తొలి స్వర్ణం
ఈ క్రమంలో భారత్ ఆశలన్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడే రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సురభి రావులపై నిలవగా.. 20 ఏళ్ల ఇషా శనివారం పసిడి పతకం గెలిచింది. నింగ్బో స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన పోటీ ఫైనల్లో యావో కియాంగ్జున్ (చైనా)ను 0.1 పాయింట్ తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్ చాంపియన్ ఓ యెజిన్ (సౌత్ కొరియా) కాంస్యం దక్కించుకుంది.
కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక ఈ తెలంగాణ షూటర్ గెలుపుతో.. ఈ ఈవెంట్లో బోణీ కొట్టిన భారత్ పతకాల పట్టికలో ఎట్టకేలకు చోటు సంపాదించింది. ప్రస్తుతానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆతిథ్య దేశం చైనా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
చదవండి: బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!