
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీని భారత్ ‘టాప్’ ర్యాంక్‌తో ముగించింది. చివరిరోజు బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ 585 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన సాహిల్ 573 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో ముకేశ్‌కిది రెండో పతకం. అంతకుముందు ముకేశ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతం గెలిచాడు.
జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ తేజస్విని 30 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది.