వైభవ్ సూర్యవంశీ... ఈ యువ క్రికెటర్ గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అద్భుత బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం ప్రస్తుతం ఐపీఎల్-2026లో కూడా దుమ్ములేపుతున్నాడు.
వైభవ్ 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్‌లో అదరగొడుతున్న వైభవ్‌ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'ఇంపాక్ట్ సబ్' నిబంధన కారణంగా వైభవ్ ఒక ఆల్‌రౌండ్ క్రికెటర్‌గా ఎదగలేకపోతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఈ ఏడాది సీజన్‌లో వైభవ్‌ను రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వాడుకుంటోంది. రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఈ యంగ్ కిడ్ గ్రౌండ్‌లో కాకుండా బెంచ్‌పైనే కనిపిస్తున్నాడు.
"వైభవ్ సూర్యవంశీని కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఒక క్రికెటర్ అంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. ఒక 'కంప్లీట్ క్రికెటర్'గా ఎదగాలంటే కచ్చితంగా ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంజమామ్ హల్ హక్ గొప్ప బ్యాటర్ మనందరికి తెలుసు. కానీ అతడు ఫీల్డ్‌లో కాస్త నెమ్మదిగా ఉంటాడు. అయినప్పటికి అతడు మైదానంలో ఉండి ఫీల్డింగ్ చేసేవాడు.
ఫీల్డ్‌లో ఉంటేనే వారి లోపాలు, బలాలు అన్నీ స్పష్టంగా తెలిసేవి. కానీ ఇప్పుడు 'ఇంపాక్ట్ సబ్' వల్ల ఫీల్డ్‌లో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించడం లేదు. కేవలం 6 బంతులు ఆడే హిట్టింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ప్లేయర్లను వాడుకోవడం సరికాదు.
ఆటగాడి నుంచి అన్ని కోణాలూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆశించకపోయినా, కనీసం అతను మైదానంలో ఉండి గేమ్‌ను ఆస్వాదించాలి. ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌లో రాణించాలనే కసి ఒక ఆటగాడి మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆటగాళ్లను కష్టపడే స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందుకే ఇంపాక్ట్ రూల్‌ను బీసీసీఐ రద్దు చేయాలని కోరుకుటున్నాను" అని మంజ్రేకర్ స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.


