వైభవ్‌ మరో 'చరిత్ర' | IPL 2026: Vaibhav Suryavanshi Becomes the youngest player to lead orange cap | Sakshi
Sakshi News home page

వైభవ్‌ మరో 'చరిత్ర'

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:26 PM

IPL 2026: Vaibhav Suryavanshi Becomes the youngest player to lead orange cap

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2026 ఎడిషన్‌లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్‌.. ఈ ఎడిషన్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న​ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

గతంలో ఈ రికార్డు గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్‌, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (24) ఉన్నారు.

ఈ ఏడిషన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 266.67 స్ట్రయిక్‌రేట్‌తో 50 సగటున 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వైభవ్‌ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్‌కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో టాప్‌-3 రన్‌ స్కోరర్లు రాయల్స్‌ ఆటగాళ్లే (వైభవ్‌ (200), జైస్వాల్‌ (183), జురెల్‌ (176)) కావడం మరో విశేషం.

ఇదిలా ఉంటే, గత ఎడిషన్‌లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్‌ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్‌ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్‌లో చాలా అల్‌టైమ్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. 

అతి చిన్నవయసులో ఐపీఎల్‌ అరంగేట్రంతో పాటు ఐపీఎల్‌ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్‌.. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా (ఐపీఎల్‌ చరిత్రలో) ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement